హైదరాబాద్సిటీ, వెలుగు: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్ల భద్రత విషయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, రైలు సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి, ఇందుకోసం రైల్వే ట్రాక్‌ల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న చెట్లు, వాటి కొమ్మలను వెంటనే నరికివేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వారి వద్ద జీపీఎస్ ట్రాకర్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
