- కొత్తగా చేరిన ఆరుగురు గట్టి ధురంధరులని కామెంట్
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరారు. దీంతో ప్రతిపక్ష శివసేన(యూబీటీ) ఎంపీల సంఖ్యా బలం భారీగా పడిపోయింది. ఇటీవల ఢిల్లీలో ఉద్ధవ్ థాక్రే తన పార్టీ ఎంపీలతో ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. శివసేన (యూబీటీ)కి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలుండగా..ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన మీటింగ్‌కు మాత్రం కేవలం ముగ్గురు ఎంపీలే అటెండ్ అయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు రాకుండా డుమ్మా కొట్టారు. అప్పుడే వీరంతా పార్టీ మారబోతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే, ఆ ఆరుగురు ఎంపీలు సోమవారం ఏకనాథ్ షిండే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
చట్టపరంగా ఇబ్బంది రాదా?
మన దేశంలో 'ఫిరాయింపుల నిరోధక చట్టం' ప్రకారం.. ఎంపీలు గెలిచిన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు తమ పదవులు ఊడిపోకుండా ఉండాలంటే, ఆ పార్టీకి ఉన్న మొత్తం ఎంపీల్లో కనీసం మూడింట రెండు వంతుల మంది (2/3) కలిసి రావాలి. లేదంటే వారి ఎంపీ పదవులు ఊడిపోతాయి. ఉద్ధవ్ థాక్రే పార్టీకి ఉన్న 9 మంది ఎంపీల్లో కరెక్ట్‌గా ఆరుగురు (2/3 వంతు) షిండే వైపు వచ్చారు. అందువల్ల వీరిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. దాంతో ఈ ఫిరాయింపుకు పూర్తి చట్టబద్ధత లభించనట్లయింది.
అసలైన శివసేనలోకి ఆరు పులులు చేరాయి
శివసేన (యూబీటీ) నుంచి ఎంపీలు ఓంరాజే నింబాల్కర్ (ధారాశివ్), సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్-ఈస్ట్), సంజయ్ జాదవ్ (పర్భాని), సంజయ్ దేశ్‌ముఖ్ (యావత్మాల్-వాషిమ్), నాగేష్ పాటిల్ అస్తికార్ (హింగోలి), వాక్‌చౌరే (శిరిడీ)లు తన వర్గంలో చేపడం పట్ల ఏకనాథ్ షిండే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "ఏకంగా ఆరుగురు పులులు ఇప్పుడు అసలైన శివసేన కుటుంబంలో చేరాయి. పార్టీ మార్పిడి కోసం ఉపయోగించిన "ఆపరేషన్ టైగర్" విజయవంతంగా పూర్తయింది. ఈ ఆరుగురు ఎంపీలు ప్రజలతో మమేకమయ్యే గట్టి 'ధురంధరులు '. గతంలో విల్లు-బాణం గుర్తును, శివసేన పార్టీ అస్తిత్వాన్ని రక్షించుకోవడానికే మే మొదటి తిరుగుబాటు చేశాం" అని పేర్కొన్నారు.
