హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 96 శాతం భూగర్భ జలాలను వాడేశారు.. ఒక్కరోజే 15 వేలకు పైగా వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 96 శాతం భూగర్భ జలాలను వాడేశారు.. ఒక్కరోజే 15 వేలకు పైగా వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

దేశంలో కోట్లాది మంది పౌరులకు నేటికీ కనీస అవసరమైన సురక్షిత తాగునీరు అందకపోవడం మన ప్రగతిని ప్రశ్నిస్తోంది. తాగునీరు అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, ప్రాథమిక జీవన హక్కు. కేంద్ర జల సంఘం ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం దేశంలోని 166 ప్రధాన జలాశయాలలో సగటు నీటి నిల్వ కేవలం 38.72%కి పడిపోయింది.

ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ నివేదికల ప్రకారం తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రపంచ నగరాల జాబితాలో భాగ్యనగరం (హైదరాబాద్) కూడా చేరిపోయింది.  ప్రపంచ జనాభాలో మన దేశ వాటా 18 శాతం ఉంటే, నీటి వనరుల వాటా కేవలం 4 శాతమే కావడం గమనార్హం. నీతి ఆయోగ్ హెచ్చరికల ప్రకారం 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపు కానున్నాయి. 

భాగ్యనగరంలో కేవలం ఒకే రోజులో 15,200 నీటి ట్యాంకర్ల కొనుగోళ్లు నమోదు కావడం మన భౌతిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి సజీవ సాక్ష్యం.  దీనికితోడు తాగునీటి నాణ్యత లోపించడం వల్ల దేశంలో 80 లక్షల మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు.  తాజా జూన్ 2026 క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం పార్వతీపురం మన్యం (సాలూరు) వంటి ఏజెన్సీ ప్రాంతాలు జ్వరాలతో అల్లాడుతున్నాయి. కలుషిత నీరు, దోమల ఉధృతి వల్ల ఒక్కో గ్రామం నుంచి పదుల సంఖ్యలో గిరిజనులు ఆసుపత్రుల పాలవుతున్నారు. 

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 15 మంచాలపై 43 మంది చిన్నారులు, ఒకే పడకపై ముగ్గురేసి చొప్పున చికిత్స పొందుతున్న వాస్తవం పాలకుల తాగునీటి, ఆరోగ్య ప్రణాళికల వైఫల్యానికి నిదర్శనం. ఈ సంక్షోభం వెనుక పెట్టుబడిదారుల పక్షపాత విధానాలు,  ప్రకృతిని లూటీ చేసిన చారిత్రక తప్పిదాలు ఉన్నాయి. లాభాల వేటలో కార్పొరేట్ శక్తులు అడవులను  నరికివేయడం, రసాయన వాయువులను వదలడం వల్ల వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నది.  దీని ఫలితమే నేడు ముంచుకొస్తున్న ‘సూపర్ ఎల్ నినో’ ముప్పు.

భూగర్భ జలాల పతనం
రుతుపవనాలు ముఖం చాటేస్తున్నాయి. జూన్ 2026 నివేదికల ప్రకారం పొరుగున ఉన్న మరాఠ్‌‌‌‌‌‌‌‌వాడా ప్రాంతంలో వర్షపాతం భయంకరంగా పడిపోయింది. ఛత్రపతి శంభాజీనగర్​లో  సాధారణం కంటే 80% కొరత (కేవలం 19.8% నమోదు) ఏర్పడింది.  జాల్నా (27.2%), పర్భణీ (46.8%) జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.  వ్యవసాయ నిపుణులు రైతులను విత్తనాలు వేయకుండా వేచి చూడమని హెచ్చరిస్తున్నారు.  ఈ సంక్షోభంలో ప్రమాదకరమైన కోణం భూగర్భ జలాల పతనం.  హర్యానాలోని కర్నాల్ జిల్లాలో 1974లో 5.37 మీటర్ల  లోతులో లభించిన భూగర్భ జలం, ఇప్పుడు 21 మీటర్లకు పైగా పడిపోయింది.

భాగ్యనగరంలో పరిస్థితి ఇంకా తీవ్రమైంది. తెలంగాణ భూగర్భ జల అంచనాల ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రతి ఏడాది పునరుత్పత్తి అయ్యే భూగర్భ జలాల్లో దాదాపు 96 శాతం ఇప్పటికే వినియోగంలోకి వెళ్లిపోయింది. అంటే  ప్రకృతి తిరిగి నింపే దాదాపు ప్రతి బిందువునూ మనం తోడేస్తున్నాం. దీని ఫలితంగా బోరుబావులు మరింత లోతుకు వెళ్తున్నాయి.  ఫ్లోరైడ్,  నైట్రేట్ కాలుష్యం పెరుగుతోంది.  

నీటి నిధులకు, సరఫరాకు పొంతన లేదు
పంజాబ్‌‌‌‌‌‌‌‌లో కాలువల పునరుద్ధరణ, సాగునీటి విస్తరణ వల్ల భూగర్భ జల వినియోగం 164 శాతం నుంచి 156 శాతానికి తగ్గింది.  ఇది సరైన ప్రజానుకూల విధానాలు ఉంటే భూగర్భ జలాలపై  ఒత్తిడి  తగ్గించవచ్చని చూపిస్తోంది.

భారత రాజ్యాంగంలో జీవించే హక్కును  తెలిపే నిబంధన (ఆర్టికల్ 21) ప్రకారం  స్వచ్ఛమైన తాగునీరు పొందడం పౌరుడి ప్రాథమిక హక్కు.  అందుకు తాగు నీటి ఉద్యమం అవసరం.  ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న నీటి నిధులకు, క్షేత్రస్థాయిలో వస్తున్న నీటి సరఫరాకు ఉన్న తేడాను లెక్కగట్టి,  ఆ నివేదికలను పంచాయతీ,  పురపాలక కార్యాలయాల  ముందు  ప్రదర్శించాలి. 

గత ఐదేళ్లలో  తాగునీటి కోసం,  జలాశయాల పూడికతీత కోసం  ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంత?  ఖర్చు చేసింది ఎంత?   వివరాలను  సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి పాలకులను నిలదీయాలి.  పరిశ్రమల రసాయన వ్యర్థాలపై, సమాచార నిల్వ కేంద్రాలు (డాటా సెంటర్లు) మితిమీరిన భూగర్భ జలాల దోపిడీపై జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టులో  ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాలి.

కుళాయి ఉంది కానీ నీరు రాదు!
జాతీయ తాగునీటి పథకం (జల్ జీవన్ మిషన్) కింద 80% పైగా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని రికార్డులు చెబుతున్నా, నిజానికి నాణ్యమైన నీరు అందుతున్న ఇళ్లు కేవలం 76% మాత్రమే. 

కుళాయి ఉంది కానీ నీరు రాదు! పటాన్‌‌‌‌‌‌‌‌చెరు,  జీడిమెట్ల, ముషిరాబాద్ లాంటి  పారిశ్రామిక ప్రాంతాల్లో రసాయన  కర్మాగారాలు తమ విషపూరిత రసాయనాలను నేరుగా స్థానిక జలాశయాల్లోకి వదులుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

మురుగు కాల్వ నీరు తాగునీటి పైపుల్లో కలవకుండా చూసే పురపాలక నిర్వహణా శక్తి లేకపోవడం పాలకుల వైఫల్యం. సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల చుట్టుపక్కల వెలుస్తున్న ఈ సమాచార నిల్వ కేంద్రాలు (డాటా సెంటర్లు) స్థానిక భూగర్భ జలాలను తోడేస్తున్నాయి.

పాపని నాగరాజు