- ఉత్తమ విద్యార్థులకు దుప్పట్లు, జ్ఞాపికల అందజేత
- చెన్నూరులో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్/కోటపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. భీమారంలోని కేజీబీవీలో జరిగిన కార్యక్రమంలో టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు, జ్ఞాపికలను కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి మంత్రి అందజేశారు.
ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్స్కూల్ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించి అక్కడి విద్యార్థులకు క్రికెట్ కిట్ అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు మంత్రి వివేక్ వారికి కిట్ అందించారు. చెన్నూరు మండలం లింగంపల్లి,కోటపల్లి మండలం పారిపెల్లిలో లక్ష్మిదేవర బోనాల వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. పారిపెల్లిలో బూర్తి స్వప్న-–రాజేశ్దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు.
చెన్నూరు మండలం చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యులను సన్మానించారు. మందమర్రి, చెన్నూరు పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్టోల్ఫ్రీ నంబర్ 1908ను ఆవిష్కరించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు పర్స రమేశ్, బన్సీలాల్, ఎస్సైలు పాల్గొన్నారు.
చెన్నూరులో పూర్తిస్థాయి రోడ్ల ఏర్పాటు
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మిస్తానని మంత్రి వివేక్ తెలిపారు. పాత బస్టాండ్ నుంచి రావిచెట్టు సెంటర్ వరకు చేపట్టిన రహదారి అభివృద్ధి పనులతో పాటు రావిచెట్టు సెంటర్ నుంచి చేపట్టిన బైపాస్ రోడ్డు పనులను సోమవారం రాత్రి కలెక్టర్ కుమార్‌దీపక్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్పర్సన్ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్మహేశ్ ప్రసాద్ తివారీ, కమిషనర్, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.
