- గతేడాది రెండున్నర వేలు.. ఈ ఏడాది ఐదున్నర వేలు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ నగరంలో కుక్కలు జనాల పిక్కలు పీకేస్తున్నాయి. రోజుకు 10 మందికిపైగా ఏదో ఒక చోట కుక్కల దాడికి గురవుతున్నారు. నడుచుకుంటూ వెళ్లేవారు, బైక్ లపై వెళ్లేవారి వెంటపడి కరుస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు.ఏడాదిన్నర కాలంగా సిటీలో కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో నగరంలో కుక్క కాటు ఘటనలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల వీధి కుక్కల జనాభా నియంత్రణకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించిన చర్యలు స్పీడప్ చేయాలని బాధితులు కోరుతున్నారు.
భారీగా పెరిగిన కుక్క కాటు ఘటనలు..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే కుక్కల దాడులు డబుల్ అయినట్లు సివిల్ ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు మార్చిలో 263 మంది కుక్క కాట్లతో ఇంజక్షన్స్ వేయించుకోగా.. ఈ ఏడాది మార్చిలో 473 మంది, నిరుడు ఏప్రిల్ లో 315 మంది ఆస్పత్రికి వస్తే ఈ ఏడాది 477 మంది, నిరుడు మేలో 316 మంది వస్తే ఈ ఏడాది 421 మంది బాధితులు ట్రీట్ మెంట్ కోసం వచ్చారు. 2024 - 25లో 2,612 మంది బాధితులు కుక్క కాటుకు గురికాగా, 2025 - 26 లో 5,565 మంది కుక్కల బారిన పడ్డారు.
బొమ్మకల్ లో ఏబీసీ సెంటర్..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణ చర్యలు(స్టెరిలైజేషన్) ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. ఇందుకోసం బొమ్మకల్ లో యానిమన్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) సెంటర్ ను నిర్మించారు. ఇటీవల ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆపరేషన్ థియేటర్, క్యాటిల్ షెడ్లు, కుక్కల సంరక్షణకు 38 కెనాల్స్ ఏర్పాటు చేశారు.
స్ట్రీట్ డాగ్స్ ను పట్టుకుని ఏబీసీ సెంటర్ కు తరలించడం, వాటి సంతానాన్ని నిరోధించేలా స్టెరిలైజేషన్ చేయడం, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయడం చేస్తారు. ఇలా చేసే పనికి ఒక కుక్కకు రూ.1,650 చొప్పున ఏజెన్సీకి చెల్లించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది.
కరీంనగర్ లో 21 వేల కుక్కలు..
కరీంనగర్ బల్దియా పరిధిలో 21 వేల కుక్కలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీటిలో 5 వేల కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి కాగా మరో 16 వేల కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. ఏబీసీ సెంటర్ అందుబాటులోకి రావడంతో మిగతావాటికి స్టెరిలైజేషన్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
