కలవరం పుట్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ఈ పరిణామం ఒక హెచ్చరిక

కలవరం పుట్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ఈ పరిణామం ఒక హెచ్చరిక

డిజిటల్ యుగంలో సమాచార సాధనాలు కేవలం సంభాషణలకే  పరిమితం కాకుండా,  రాజకీయ వ్యవస్థలను సైతం శాసించే అదృశ్య శక్తులుగా అవతరిస్తున్నాయి. ఈ  సాంకేతిక విప్లవ కాలంలో కేవలం సామాజిక వేదికలపై వినూత్న  హాస్యభరిత  వ్యంగ్య పోరాటంగా మొదలై,  నేడు  ప్రధాన స్రవంతి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలవరం పుట్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రస్థానం అత్యంత ఆశ్చర్యకరం.

దేశంలో  నిరుద్యోగం,  యువత ఉపాధి అవకాశాల దుస్థితిపై  కొందరు  ప్రముఖులు చేసిన  వివాదాస్పద వ్యాఖ్యలకు  ప్రతిస్పందనగా ఆవిర్భవించిన ఈ సరికొత్త సమూహం, అతి తక్కువ కాలంలోనే  లక్షలాది మంది యువతను ఈ డిజిటల్ ప్రవాహం తనవైపు తిప్పుకుంది.  అయితే, ఈ హఠాత్ పరిణామం పట్ల అధికార కమల దళాలు అత్యంత వ్యూహాత్మకంగా, తీవ్ర ఆందోళనతో స్పందిస్తున్న తీరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోంది.

సాధారణంగా ఏ బలమైన రాజకీయ శక్తి అయినా తమకు సమానమైన సంప్రదాయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. కానీ,  ఇక్కడ శత్రువు ఎవరో కంటికి కనిపించదు. స్పష్టమైన నాయకత్వం లేదు, కార్యాలయం లేదు,  భౌతిక శ్రేణులు అసలే లేవు.  కేవలం మీమ్స్,  వ్యంగ్య చిత్రాలు,  హాస్యభరిత వ్యాఖ్యల ఆధారంగా నడిచే ఒక అదృశ్య సైన్యాన్ని ఎలా అదుపు చేయాలో  తెలియకపోవడంతో  అధికార పీఠాల్లో తీవ్ర ఆందోళన కలగడం సహజం.  ఈ కలవరమే కమల శ్రేణుల తీవ్ర దూకుడుకు ప్రధాన కారణం.  కాక్రోచ్  పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సాధారణ యువతీ యువకులపై  వ్యక్తిగత దాడులు చేయడం, వారి ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేయడం,  అసత్య  ప్రచారాలకు ఒడిగట్టడం వెనుక ఒక వ్యవస్థీకృత భయం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా దాడులు
కాక్రోచ్ పార్టీ ప్రచారం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని, దేశ విచ్ఛిన్నానికి  ప్రయత్నిస్తున్న శక్తుల హస్తం ఉందని  అధికార వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.  పొరుగు దేశాలకు  చెందిన కొన్ని సామాజిక ఖాతాలు సైతం ఇలాంటి మీమ్స్‌‌‌‌‌‌‌‌ను  పంచు కోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందని వారి వాదన.  ఒకవేళ  దేశ భద్రతకు నిజంగానే  విదేశీ శక్తుల నుంచి  ముప్పు పొంచి ఉంటే,  ప్రభుత్వం ఎందుకు చట్టపరమైన దర్యాప్తునకు ఆదేశించడం లేదు?  దేశంలో  అత్యంత  పటిష్టమైన సైబర్ చట్టాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, అగ్రశ్రేణి నిఘా విభాగాలు అందుబాటులో ఉన్నాయి.  దేశ  సార్వభౌమాధికారానికి  భంగం  కలిగిస్తున్న శక్తులపై  నిరూపితమైన ఆధారాలతో  కఠినచర్యలు తీసుకోవడం  ఏ  ప్రభుత్వానికైనా ప్రాథమిక విధి.  మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నట్లు ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసే పాలకుల ఉద్దేశాలు  చెడ్డవైతే అది కూడా చెడ్డదిగా మారుతుంది’.

భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు
చట్టపరమైన విచారణల కంటే కేవలం ప్రచారాల ద్వారానే ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చనే రాజకీయ వ్యూహం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వివాదం తాలూకు సానుకూల కోణాన్ని పరిశీలిస్తే,  ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి వ్యంగ్యం  ఎప్పుడూ ఒక  అత్యంత  శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతోంది. దేశంలో  రోజురోజుకూ తీవ్రతరమవుతున్న  నిరుద్యోగ  సమస్య,  వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల  లీకేజీలు,  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న అంతులేని ఆలస్యం వంటి అంశాలతో లక్షలాది మంది యువత  తీవ్ర నిరాశలో  మునిగిపోయారు.  తమ ఆవేదనను,  ఆక్రోశాన్ని  పాలకులకు  వినిపించేందుకు సరైన  వేదికలు కరువైనప్పుడు,  వారు  సామాజిక  మాధ్యమాలను ఆశ్రయించడం  సహజం.  మీమ్స్ రూపంలో  వ్యవస్థలోని లోపాలను  ఎండగట్టడం చట్టవిరుద్ధం కాదు.  తమ భవిష్యత్తు కోసం శాంతియుత మార్గంలో, హాస్యాన్ని జోడించి ప్రశ్నిస్తున్న దేశ యువతను శత్రువులుగా పరిగణించడం  ప్రజాస్వామ్య దేశానికి  శ్రేయస్కరం కాదు.

అధికార పక్ష వాదనలో సైతం సహేతుకత
పాలకుల వైఫల్యాలపై దృష్టి మరల్చడానికి ఇలాంటి కొత్త వివాదాలను సృష్టించడం సరైన పద్ధతి కాదు. అదే సమయంలో, దేశ భద్రత, సామాజిక స్థిరత్వం అనే కోణంలో పాలకులకు ఉండే ఆందోళనలను సైతం మనం పూర్తిగా కొట్టిపారేయలేం.

నేటి అత్యాధునిక సమాచార సాంకేతిక యుగంలో ఆల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే  సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లను  దేశ వ్యతిరేక శక్తులు అత్యంత సులభంగా తమ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉంది.  కేవలం వినోదం కోసం పుట్టిన ఒక మీమ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని, దేశంలో అరాచకత్వాన్ని సృష్టించాలని కుట్రలు పన్నే విదేశీ ఏజెన్సీల పట్ల పాలకులు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అత్యంత ఆవశ్యకం.

బాధ్యతారాహిత్యంగా చేసే కొన్ని తీవ్రమైన విమర్శలు  సామాజిక సామరస్యానికి భంగం కలిగించవచ్చు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది దేశ సార్వభౌమాధికారానికి,  అంతర్గత భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలిగించకూడదనే అధికార పక్ష వాదనలో సైతం కొంత సహేతుకత ఉందనేది కాదనలేని సత్యం.  డిజిటల్ వేదికలపై స్వేచ్ఛను ఆస్వాదించేటప్పుడు సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. 

విమర్శలను స్వీకరించే సహనం పాలకులకు ఉండాలి
దీనిని కేవలం శాంతిభద్రతల సమస్యగానో లేదా విదేశీ శక్తుల కుట్రగానో  అభివర్ణించి అసలు సమస్య  మరుగునపడిపోతుంది. పాలకులు తమ విధానాలలో మార్పులు చేసుకోవడానికి,  ఉపాధి కల్పనపై  ప్రత్యేక దృష్టిపెట్టడానికి ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా భావించాలి.

విమర్శలను  స్వీకరించే  సహనం  ప్రజా స్వామ్య పాలకులకు ఉండాలి.  ప్రభుత్వం తనపై  వచ్చే  విమర్శలను  దేశ ద్రోహంగా  చిత్రీకరించి తప్పించుకునే ధోరణిని  పక్కనపెట్టి, సమస్యల  నివారణకు చిత్తశుద్ధితో తగిన చర్యలు  చేపట్టాలి.

రాజ్యాంగంలో పొందుపరిచిన పాలనా సూత్రాలను అనుసరిస్తూ ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు నిత్యం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ నమ్మకాన్ని గెలవాలి. నిజంగానే విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉంటే, వాటిని చట్టపరమైన దర్యాప్తు ద్వారా బహిర్గతంచేసి  నిజాలను నిరూపించాలి. ఈ క్రమంలో సంకుచిత వైఖరిని పక్కనపెట్టి  రాజకీయ పార్టీలు నవతరాన్ని రాజకీయాల్లోకి సంతోషంగా  ఆహ్వానించాలి.

డా. కట్కూరి సైబర్ నిపుణుడు & పాలసీ విశ్లేషకుడు