చింద్వారా: మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా టెమ్నీ విలేజ్ సమీపంలోని చింద్వారా-బెతుల్ నేషనల్ హైవేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కూలీల పికప్ వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ఆరుగురు కూలీలు చనిపోగా, 21 మందికి గాయాలయ్యాయని ఎస్పీ అజయ్ పాండే తెలిపారు. ట్రక్కు బ్యాక్ టైర్ పేలిపోవడం వల్లే కంట్రోల్ తప్పిందని, ముందుగా బైక్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత పికప్ వ్యాన్‌ను గుద్ది బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు క్లియర్ చేశారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అదనపు ఎస్పీ ఆశిష్ ఖరే పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి రూ. లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
