ప్రశ్నించరాని సంస్థగా RSS ‌‌‌‌‌‌‌? వందేళ్లుగా ఎవరూ అడగకపోతే ఇకపై కూడా అడగకూడదా ?

ప్రశ్నించరాని సంస్థగా RSS ‌‌‌‌‌‌‌? వందేళ్లుగా ఎవరూ అడగకపోతే ఇకపై కూడా అడగకూడదా ?

భారతదేశ రాజకీయాల్లో నేడు కనిపిస్తున్న ప్రధాన పోరాటం కేవలం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య కాదు. అది రెండు భారతదేశాల మధ్య జరుగుతున్న భావజాల సంఘర్షణ.  ఒకటి మహాత్మా గాంధీ తన  ‘హింద్ స్వరాజ్’లో ప్రతిపాదించిన  బహుళత్వ, ప్రజాస్వామ్య,  సహజీవన భారతదేశం. మరొకటి  హిందూత్వ జాతీయవాదం ఆధారంగా నిర్మిస్తున్న భారతదేశం. 1909లో మహాత్మా గాంధీ రచించిన  ‘హింద్ స్వరాజ్’ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక నైతిక,  రాజకీయ దిశానిర్దేశం.

గాంధీ దృష్టిలో భారతదేశం అనేది కేవలం హిందువుల దేశం కాదు.  అనేక మతాలు, భాషలు, సంస్కృతులు, కులాలు కలిసి జీవించే నాగరికత. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు.  ప్రజల భాగస్వామ్యం,  నైతిక రాజకీయాలు, వికేంద్రీకరణ, సామాజిక న్యాయం.  దీనికి భిన్నంగా స్వాతంత్ర్యానికి ముందు కాలంలో ఆవిర్భవించిన  హిందూత్వ భావజాలం  భారతదేశాన్ని ప్రధానంగా ఒక సాంస్కృతిక జాతిగా  నిర్వచించే  ప్రయత్నం చేసింది. ఈ  భావజాలానికి సంస్థాగత రూపంగా ఎదిగింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) ఆవిర్భావ చరిత్రలో  డాక్టర్  బి.ఎస్. మూంజే పేరు తరచూ కనిపిస్తుంది. హెడ్గేవార్‌‌‌‌‌‌‌‌కు రాజకీయ మార్గదర్శకుడిగా భావించే మూంజే 1930ల ప్రారంభంలో  ఇటలీలో  పర్యటించారు. అక్కడ  బెనిటో ముస్సోలినీ పాలనలో  పనిచేస్తున్న  యువజన,  సైనిక శిక్షణ సంస్థలను పరిశీలించారు. ఆ సంస్థల క్రమశిక్షణ,  కేంద్రీకృత నిర్వహణ,  జాతీయవాద  ప్రచార పద్ధతులు ఆయనను ఆకట్టుకున్నాయని చరిత్రకారులు ప్రస్తావిస్తారు.  లండన్‌‌‌‌‌‌‌‌లో  జరిగిన  రౌండ్ టేబుల్  సమావేశాలకు కూడా మూంజే  హాజరయ్యారు.  అదే సమయంలో  మహాత్మా గాంధీ  కూడా  భారత జాతీయ  కాంగ్రెస్ తరఫున ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. 

అయితే గాంధీ అక్కడ ప్రజాస్వామ్య  స్వరాజ్యం కోసం వాదిస్తే,  మూంజే దృష్టి హిందూ సమాజాన్ని  ఒక  క్రమశిక్షణ  రాజకీయ శక్తిగా నిర్మించడంపైనే ఎక్కువగా కేంద్రీకృతమైందని విమర్శకులు పేర్కొంటారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అనుకూల వర్గాలు ముస్సోలినీ లేదా  యూరోపియన్  ఫాసిస్టు ఉద్యమాల ప్రభావం ఉందనే ఆరోపణలను తిరస్కరిస్తాయి.  అయినప్పటికీ  మూంజే ఇటలీ పర్యటన, ఆ తర్వాత సంఘ్ నిర్మాణంలో కనిపించిన క్రమశిక్షణా నమూనాల మధ్య సంబంధంపై చరిత్రకారుల చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ప్రశ్నించరాని సంస్థగా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌ ‌‌‌‌‌‌‌?
ఇటీవల కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే  రాజకీయంగా అత్యంత ప్రధాన్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చట్టబద్ధ సంస్థా? దాని రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది? దాని న్యాయపరమైన హోదా ఏమిటి ? ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.  దీనికి ప్రతిస్పందనగా  సర్‌‌‌‌‌‌‌‌సంఘ్‌‌‌‌‌‌‌‌చాలక్  మోహన్ భాగవత్ ‘వందేళ్లుగా ఎవరూ మమ్మల్ని ఈ ప్రశ్న అడగలేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే  ప్రజాస్వామ్యంలో అసలు ప్రశ్న ఇదే. వందేళ్లుగా ఎవరూ అడగకపోతే  ఇకనూ  అడగకూడదా?  దేశ రాజకీయాలపై  అత్యంత  ప్రభావం చూపుతున్న ఒక సంస్థ తన నిర్మాణం, చట్టబద్ధ హోదా,  ఆర్థిక వ్యవస్థ  గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత లేదా?

మహేశ్​ జెఠ్మలానీ వాదన
ప్రియాంక్​ ఖర్గే  ప్రశ్నలను  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది  మహేశ్​ జెఠ్మలానీ వ్యతిరేకించారు. ఆయన వాదన ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) ప్రకారం వ్యక్తులు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కలిగి ఉంటారు. సామాజిక  లేదా  సాంస్కృతిక  కార్యక్రమాల కోసం కూడిన ప్రతి సమూహం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టపరంగా ఈ వాదనలో బలం ఉండవచ్చు. కానీ రాజకీయంగా,  నైతికంగా  మరో ప్రశ్న  తలెత్తుతుంది.  దేశంలో లక్షలాది సభ్యులు, వేలాది శాఖలు,  వేల కోట్ల ఆస్తులు, వందల అనుబంధ సంస్థలు,  విద్య, సాంస్కృతిక, - సామాజిక రంగాలపై విస్తృత ప్రభావం, అలాగే అధికార పార్టీపై  ప్రత్యక్ష ప్రభావం కలిగిన సంస్థను సాధారణ వ్యక్తుల సమూహంగా మాత్రమే పరిగణించవచ్చా?  ఇక్కడ  చట్టం మాత్రమే కాదు, పారదర్శకత కూడా చర్చలోకి వస్తుంది.

ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ – బీజేపీ సంబంధంపై ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరచూ తాము  రాజకీయ పార్టీ కాదని చెబుతుంది.  అది వాస్తవమే.  కానీ  భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీ అయిన బీజేపీకి  భావజాల,  నాయకత్వ,  సంస్థాగత మూలాలు సంఘ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయని ఎవరూ ఖండించలేరు.  అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయి నుంచి నరేంద్ర మోదీ వరకు  అనేకమంది ప్రముఖ నాయకులు సంఘ్  ప్రచారకులుగానే  తమ  రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  అందువల్ల  సంఘ్ కేవలం ఒక సామాజిక సంస్థ మాత్రమే కాదు.  భారత  రాజకీయాలపై  ప్రభావం చూపే  ప్రధాన భావజాల కేంద్రం. అధికారంపై  ప్రభావం ఉంటే జవాబుదారీతనం కూడా ఉండాలి. 

సామాజిక ప్రాతినిధ్యంపై ప్రశ్నలు
ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ‘వసుధైవ కుటుంబకం’ అని చెబుతుంది. సమాజ సామరస్యత గురించి మాట్లాడుతుంది.  కానీ  విమర్శకులు అడిగే ప్రశ్న మరింత  లోతైనది. వందేళ్ల చరిత్రలో అత్యున్నత నాయకత్వ స్థానాల్లో ఎవరు ఉన్నారు? ఇప్పటివరకు  సంఘ్‌‌‌‌‌‌‌‌కు  ఆరుగురు సర్‌‌‌‌‌‌‌‌ సంఘ్‌‌‌‌‌‌‌‌చాలకులు నాయకత్వం వహించారు. వారిలో ఐదుగురు బ్రాహ్మణులు, ఒకరు రాజ్‌‌‌‌‌‌‌‌పుత్ వర్గానికి చెందినవారు. 

దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు లక్షల సంఖ్యలో కార్యకర్తలుగా ఉన్నప్పటికీ అత్యున్నత నాయకత్వంలో వారి ప్రాతినిధ్యం ఎందుకు  కనిపించలేదని  విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.  ప్రజాస్వామ్యం  కేవలం  సభ్యత్వంతో కాదు.  అధికార  పంపిణీతో  కొలవడం జరుగుతుంది. 

ప్రజాస్వామ్యానికి హెచ్చరిక
 ప్రియాంక్​ ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ రమేష్  జిగజినగి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించినవారు భూమిపై లేకుండా పోయారు’ అనే భావనతో ఆయన చేసిన హెచ్చరిక ప్రజాస్వామ్య వర్గాల్లో  ఆందోళన కలిగించింది.

ప్రజాస్వామ్యంలో వాదనకు ప్రతి వాదన ఉండాలి. ప్రశ్నకు సమాధానం ఉండాలి. కానీ ప్రశ్నించిన వారిని హెచ్చరించే రాజకీయ సంస్కృతి ప్రమాదకరం. గాంధీని ప్రశ్నించారు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ను  ప్రశ్నించారు. నెహ్రూను ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను  ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రశ్నించారు.  బీజేపీని  ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు ప్రశ్నించకూడదు ? 

ప్రియాంక్ ఖర్గే లక్ష్యం ఏమిటి ?
ప్రియాంక్ ఖర్గే  ప్రశ్నలు వెనుక రాజకీయ వ్యూహం లేదని  చెప్పడం అమాయకత్వమే.  కచ్చితంగా రాజకీయ కోణం ఉంది.  కానీ అదే సమయంలో ఇది మరింత పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ఎన్నికైన ప్రభుత్వాల కంటే ఎక్కువ  భావజాల  ప్రభావం చూపుతున్న సంస్థలు  ఎంతవరకు ప్రజా పరిశీలనకు లోబడి ఉండాలి?   ఖర్గే లక్ష్యం బహుశా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను నిషేధించడం కాదు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను  ప్రజల ముందుకు తీసుకురావడం.

దాని నిర్మాణం, అధికార సంబంధాలు, సామాజిక ప్రాతినిధ్యం, దాని ఆర్థిక వ్యవస్థ,  రాజ్యాంగ దృక్పథం గురించి బహిరంగ చర్చ ప్రారంభించడం.  అంతిమంగా... భారతదేశం  నేడు ఒక కూడలిలో నిలబడి ఉంది. ఒక దారి గాంధీ ‘హింద్ స్వరాజ్’ చూపించిన  ప్రజాస్వామ్య,  బహుళత్వ, రాజ్యాంగ మార్గం. మరోదారి కేంద్రీకృత సాంస్కృతిక జాతీయవాద  రాజకీయాల దిశ.

ఈ చర్చలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించడం దేశ ద్రోహం కాదు. అది ప్రజాస్వామ్య హక్కు. ప్రశ్నలకు సమాధానం  చెప్పడం బలహీనత కాదు. అది ప్రజాస్వామ్య బాధ్యత. గాంధీ కలలుగన్న భారతదేశం నిలబడాలంటే అది ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, లేదా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కావచ్చు.. ప్రజల ప్రశ్నలకు జవాబుదారిగా ఉండాల్సిందే.  ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం సంస్థలది కాదు ప్రజలది.

హిందూ సామాజిక వ్యవస్థల పట్ల ఎక్కువ ఆసక్తి
స్వాతంత్ర్య భారతదేశానికి  రాజ్యాంగం సామాజిక  విప్లవ పత్రం.  అది జన్మ ఆధారిత హక్కులను తిరస్కరించింది. సమాన పౌరసత్వాన్ని ప్రకటించింది.  ఎస్సీ,  ఎస్టీ,  బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించింది.

కానీ సంఘ్ చరిత్రలోని కొన్ని వ్యాఖ్యలు, కొన్ని సిద్ధాంత చర్చలు రాజ్యాంగం కంటే సంప్రదాయ హిందూ సామాజిక వ్యవస్థల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపాయని విమర్శకులు పేర్కొంటారు.  అందుకే  రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల విషయంలో సంఘ్ అసలు వైఖరి  ఏమిటనే ప్రశ్న తరచూ ముందుకువస్తోంది.

సీహెచ్‌‌‌‌‌‌‌‌వీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, సీనియర్​ జర్నలిస్ట్