- మీరు సొంత దేశానికి కూడా తిరిగి వెళ్లలేరని కామెంట్
- శాంతి చర్చల వేళ అమెరికా అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు
జెనీవా: ఒకవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి స్విట్జర్లాండ్‌లో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతుండగానే, ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని గనుక మూసివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
‘‘మీరు గనుక హార్మూజ్ జలసంధిని మూసివేస్తే, ఇక మీకు దేశమే మిగలదు. చివరికి మీరు మీ సొంత దేశానికి కూడా తిరిగి వెళ్లలేరు’’ అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చలను తీవ్ర ఉత్కంఠలోకి నెట్టాయి.
ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరిస్తే.. అమెరికా సైన్యమే నేరుగా హార్మూజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే, లెబనాన్‌లో అలజడులు సృష్టిస్తున్న హెజ్బుల్లా ఉగ్రవాదులను ఇరాన్ వెంటనే అదుపు చేయాలని, లేదంటే గత వారం కంటే మరింత తీవ్రంగా ఇరాన్‌పై దాడులు చేస్తామని తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.
దీటుగా కౌంటర్ ఇచ్చిన ఇరాన్
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఇరాన్ ముఖ్య రాయబారి మహమ్మద్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ‘‘అమెరికా హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదు. మా సాయుధ
దళాలు వేరే రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. వారు కేవలం మాటలకే పరిమితం, కానీ మేం చేతల్లో చూపిస్తాం” అని పేర్కొన్నారు.
