పార్టీలను చోరీ చేసే రోజులొస్తయ్: మీనాక్షి నటరాజన్‍

పార్టీలను చోరీ చేసే రోజులొస్తయ్: మీనాక్షి నటరాజన్‍
  • ఇప్పటికే ఓట్ల చోరీ, నా రాజ్యసభ సీటు చోరీ జరిగింది 
  • రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందన్న నిర్లక్ష్యం వద్దు
  • ఒక్క ఓటునూ తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి: మీనాక్షి నటరాజన్‍
  • రాష్ట్రంలోనూ లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర: పొన్నం 
  • తెలంగాణలో పవన్ జోక్యం అవసరం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

వరంగల్‍, వెలుగు: భవిష్యత్లో రాజకీయ పార్టీలను కూడా చోరీ చేసే కుట్రలు జరగవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షీ నటరాజన్‍ విమర్శించారు. ఎస్‍ఐఆర్‍ ప్రక్రియను కేంద్రం ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటుందని ఆరోపించారు.

తమ ఓటు బ్యాంకును ముట్టుకోకుండా.. తర పార్టీల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ‘మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత నా రాజ్యసభ సీటును చోరీ చేశారు. అవసరమైతే రాజకీయ పార్టీలను కూడా చోరీ చేసే పరిస్థితులు వస్తాయి’ అని ఆమె విమర్శించారు.

సోమవారం హనుమకొండలో జరిగిన ఎస్‍ఐఆర్‍ పై అవగాహన, బీఎల్‍ఏల శిక్షణ సదస్సుకు పీసీసీ చీఫ్‍ మహేశ్‍ గౌడ్‍తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందన్న ధీమాతో ఓటర్ల సవరణపై నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏజెంట్లు అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బెంగాల్‍, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఎల్‍ఏ సదస్సు ఇన్​చార్జి ఎమ్మెల్యే రామ్మోహన్‍ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు.

పవన్‍ జోక్యం అవసరం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్‍ గౌడ్‍
తెలంగాణ రాజకీయాల్లో పవన్​కల్యాణ్​ జోక్యం అవసరంలేదని టీపీసీసీ చీఫ్‍ మహేశ్‍ గౌడ్‍ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‍  కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మీనాక్షీ నటరాజన్‍, పొన్నం ప్రభాకర్‍ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా యాక్టర్లుగా పవన్‍ కల్యాణ్‍, చిరంజీవిని అభిమానిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇస్తే తాను పది రోజులు అన్నం తినలేదన్న పవన్..​ ఇప్పుడు తెలంగాణ ఆదర్శం అంటూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు నూకలు చెల్లిపోయాయని.. ఆస్తి తగాదాల్లో చెల్లిని పొగొట్టుకున్నారని అన్నారు.

ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, తప్పులుంటే సరిదిద్దుకుంటామన్నారు. కానీ,  కేటీఆర్‍, హరీశ్​రావు  బట్టకాల్చి మీదేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు తెలివి ఉండే కాంగ్రెస్‍ నేత రాహుల్‍గాంధీ అపాయింట్​మెంట్‍ అడుగుతున్నాడా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‍ పార్టీ 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.