ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీస్, 30 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, పోలీసు శాఖలో 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని విమర్శించారు. విద్యాశాఖ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా, ఎయిడెడ్ పాఠశాలల్లో కలిపి సుమారు 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీఎం చెప్తున్నారని, ఉపాధ్యాయుల కొరత ఉండగా విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎలా అందుతుందని నిలదీశారు. ఇక 14 యూనివర్సిటీల్లో 2,800 ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విస్తృత ప్రచారం చేసి, నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చారన్నారు. తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు అనంతయ్య, రాజేందర్, అంజి గౌడ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
