అవసరమున్న చోటికే నాబార్డ్ నిధులు..పని మొదలవ్వని బడులకు నిధుల కోత

అవసరమున్న చోటికే నాబార్డ్ నిధులు..పని మొదలవ్వని బడులకు నిధుల కోత
  • గదుల కొరత ఉన్న స్కూళ్లకు రూ. 617 కోట్లు మళ్లింపు
  • సర్కారుకు సమగ్ర శిక్షా ఎస్పీడీ ప్రపోజల్స్.. త్వరలోనే ఆర్డర్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధుల వినియోగంలో విద్యాశాఖ కీలక మార్పులు చేస్తోంది. నాబార్డ్ కింద మంజూరైన ఫండ్స్‌‌ను అవసరమే ప్రాతిపదికగా మళ్లించాలని నిర్ణయించింది. గతంలో నిధులు మంజూరైనా.. స్థల సమస్యలు లేదా ఇతర రీజన్స్ వల్ల ఇప్పటివరకు పనులు ప్రారంభం కాని చోట వాటిని రద్దు చేయనున్నారు. ఆ నిధులను విద్యార్థుల సంఖ్య పెరిగి, అదనపు గదులు  అత్యవసరమైన స్కూళ్లకు మళ్లించనున్నారు.

ఈ మేరకు ఇటీవల సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) నవీన్ నికోలస్ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు నివేదిక పంపారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం మొత్తం రూ. 1080.01 కోట్ల అంచనాతో (ఎస్టిమేషన్) పనులు చేపట్టింది. దీంట్లో నాబార్డ్ నుంచి రూ. 918.01 కోట్ల లోన్ అందనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 162 కోట్లు వెచ్చించనుంది. ఈ నిధుల్లో సుమారు రూ. 919 కోట్లు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసమే కేటాయించారు. అయితే, గ్రౌండ్ లెవల్‌‌లో కొన్ని చోట్ల పనులు మొదలుకాకపోవడంతో, ఆ ఫండ్స్ వృథా కాకుండా పునఃకేటాయింపులు చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

రూ. 617 కోట్ల మళ్లింపు ఇలా..

మొత్తం మంజూరైన పనుల్లో సుమారు రూ. 617.81 కోట్ల విలువైన పనులను రీ-అలోకేషన్ చేయాలని ఎస్పీడీ తన లేఖలో ప్రతిపాదించారు. ఇందులో రూ. 352.37 కోట్ల విలువైన పనులను.. అదే జిల్లాలో పని మొదలవ్వని స్కూళ్ల నుంచి గదుల అవసరం ఎక్కువగా ఉన్న మరో స్కూల్‌‌కు మార్చనున్నారు. ఇక ఒక జిల్లాలో కేటాయించి ఉపయోగించుకోని రూ. 265.44 కోట్ల నిధులను, ఇతర జిల్లాల్లో క్లాస్ రూమ్స్ కొరత తీవ్రంగా ఉన్న స్కూళ్లకు మళ్లించేలా ప్లాన్ సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వందలాది సర్కారు స్కూళ్లలో స్టూడెంట్స్ అడ్మిషన్స్ గణనీయంగా పెరిగినా, కూర్చునేందుకు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిధులున్నా కొన్ని చోట్ల పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి సిట్యుయేషన్‌‌ను చక్కదిద్ది, ఫండ్స్ బ్లాక్ అవ్వకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. ఈ నిధుల మళ్లింపునకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రాగానే, కొత్తగా సెలెక్ట్ చేసిన స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు స్పీడప్ కానున్నాయి.