- వచ్చే ఏడాది నుంచి డిప్లొమా సీట్లన్నీ డిగ్రీలుగా మార్పు
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్యలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిప్లొమా కోర్సులను పూర్తిగా రద్దు చేసి, వాటిని పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) కోర్సులుగా మార్చాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
2026-27 విద్యా సంవత్సరమే పీజీ డిప్లొమా అడ్మిషన్లకు చివరి ఏడాది అని, 2027-28 నుంచి ఈ కోర్సులు ఉనికిలో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లంగర్ అన్ని మెడికల్ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చాలా మెడికల్ కాలేజీల్లో ఒకే స్పెషాలిటీలో అటు డిప్లొమా, ఇటు డిగ్రీ కోర్సులు కొనసాగుతున్నాయి.
అయితే, డిగ్రీ కోర్సులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, క్లినికల్ మెటీరియల్ ఇప్పటికే సదరు కాలేజీల్లో అందుబాటులో ఉండటంతో.. డిప్లొమా సీట్లను డిగ్రీ సీట్లుగా మార్చడం మేలని కమిషన్ అభిప్రాయపడింది. దీనివల్ల పీజీ పూర్తి చేసిన డాక్టర్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం పీజీ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు, వాటిని ఎండీ, ఎంఎస్ సీట్లుగా మార్చుకోవడానికి కొత్త పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయనుంది.
