ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు వచ్చే నెల నుంచి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఎంపీడీవో ఆఫీస్ బిల్డింగ్ ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతేడాది మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి, రూ.14 కోట్ల వడ్డీని భరించిందని గుర్తుచేశారు. ప్రతి మహిళా సంఘం సభ్యురాలి ఆర్థికాభివృద్ధి కోసం పథకాలను వారి పేరిటనే అందిస్తున్నామని, త్వరలోనే కుట్టు మెషీన్లు ఇచ్చి అంగన్‌వాడీ, పాఠశాల విద్యార్థుల దుస్తులను కుట్టే బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేశామన్నారు.
హరీశ్ రావు ఆరడుగుల అబద్ధం
నాగర్ కర్నూల్, వెలుగు : 'మాజీ మంత్రి హరీశ్ రావు ఆరడుగుల అబద్ధం, మీ పాలనలో అవినీతి అక్రమాలు, పర్సంటేజీల బాగోతాలు, బోగస్ హామీలు భరించలేక ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అంత కడుపు మంట ఎందుకు' అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బోగస్ హామీలతో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ లీడర్లు ప్రజలిచ్చిన తీర్పును కించపరిచేలా రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణతో కలిసి సోమవారం నాగర్కర్నూల్క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను, సీఎం రేవంత్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్నారు. హరీశ్ రావుకు నిజాలు చెప్పడం చేయకాదని, కనీసం కవిత అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణకు యూరియా రాకుండా బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
