- ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. భారీ వర్షాలు కరుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరదల కారణంగా రహదారులు, వంతెనలు, కల్వర్టులు తెగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాకాలం ముగిసే వరకు సూపరింటెండింగ్ ఇంజినీర్ నుంచి ఏఈల దాకా అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, ఎక్స్కవేటర్లు, టిప్పర్లు, డీ-వాటరింగ్ పంపులు, ఇసుక సంచులు, కంకర, తారు, ఆర్‌సీసీ సామగ్రి, హెచ్‌డీపీఈ పైపులు తదితర అవసరమైన పరికరాలు, సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), తెలంగాణ డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ పోర్టల్, తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
