భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ..అంబులెన్స్ వెళ్లే దారి లేక యువకుడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ..అంబులెన్స్ వెళ్లే దారి లేక యువకుడు మృతి
  • నడిరోడ్డుపై నిలిపిన ఇసుక లారీలు
  • 2 కి.మీ. మోసుకెళ్లిన బంధువులు
  • ట్రీట్​మెంట్​ చేస్తుండగా మృతి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

మణుగూరు, వెలుగు: పురుగుల మందు తాగిన ఓ యువకుడిని హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ కు దారి లేకపోవడంతో చికిత్సకు ఆలస్యమై ఆ యువకుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమరం వంశీ (35) అనే యువకుడు కుటుంబ కలహాలతో సోమవారం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని అంబులెన్స్ ద్వారా మణుగూరుకు తీసుకువస్తుండగా సాంబాయిగూడెం, రామానుజవరం గ్రామాల మధ్య రోడ్డుపై ఇసుక లారీలు నిలిపివేయడంతో దారి లేక అంబులెన్స్ నిలిచిపోయింది.

వెంటనే కుటుంబ సభ్యులు  స్థానికులు వంశీని భుజాలపై మోసుకుంటూ రెండు కిలోమీటర్లు పైగా తీసుకువచ్చి మరో వాహనం ద్వారా హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే వంశీ మృతి చెందాడు. అరగంట ముందు తీసుకువచ్చి ఉంటే బతికే అవకాశం ఉండేదని డాక్టర్లు వెల్లడించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రోడ్డుపై రెండు కిలోమీటర్ల పైగా ఇసుక లారీలు నిలిపివేయడం మూలంగానే వంశీ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు

గత కొన్ని నెలలుగా సాంబాయిగూడెం విజయనగరం ఇసుక క్వారీల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున లారీలు వస్తూ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పోలీస్ అధికారులకు చెప్పినా చర్యలు చేపట్టలేదు. ఇసుకను తీసుకెళ్లేందుకు వచ్చిన లారీలకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆ లారీలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని సార్లు కంప్లైంట్స్ చేసినా పోలీస్ అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.