- చేయూత పింఛన్ల సర్వేలో వెలుగులోకి అక్రమాలు
- 10 వేల మంది మిస్టరీ లబ్ధిదారుల గుర్తింపు
- 41 వేల మంది మృతులకూ పింఛన్‌లు..
- రాష్ట్రవ్యాప్తంగా 83.88 శాతం ముగిసిన ధ్రువీకరణ ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చేయూత’ పింఛన్ల ప్రక్షాళనలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియలో వేలాది అక్రమాలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది లబ్ధిదారుల ఆచూకీ లేకపోయినా, వారి పేర్లపై నెలనెలా పెన్షన్లు డ్రా అవుతుండటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.
మరోవైపు 41 వేల మందికి పైగా మరణించిన వారి పేర్లపైనా పెన్షన్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. డూప్లికేట్ ఆధార్‌లు, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ తెలంగాణలో పెన్షన్ పొందుతున్న వారి వ్యవహారాలు బయటపడటంతో సంక్షేమ శాఖలో లొసుగులు తేటతెల్లం అవుతున్నాయి.
హైదరాబాద్, వెలుగు: చేయూత పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ చేపట్టగా అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది లబ్ధిదారులను 'నాట్ ట్రేసబుల్'గా అధికారులు గుర్తించారు.
పింఛన్ డబ్బులు మాత్రం ప్రతి నెలా డ్రా అవుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో విచారిస్తే ఆ లబ్ధిదారులు ఎక్కడున్నారో తెలియడం లేదు. వారి ఆచూకీ కోసం అధికారులు రెండు, మూడు సార్లు ప్రత్యేకంగా సర్వే నిర్వహించినా ఫలితం దక్కలేదు. వేలిముద్రలు లేదా ఐరిస్ నమోదు కోసం వారు అందుబాటులోకి రాకపోవడంతో, ఇన్నాళ్లూ వీరి పేర్లతో పింఛన్ సొమ్ము ఎవరు కాజేస్తున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో 41 వేల మందికి పైగా లబ్ధిదారులు మరణించినప్పటికీ, వారి పేర్లపై పింఛన్లు డ్రా అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అర లక్షకుపైగా అనర్హుల పింఛన్లను అధికారులు గుర్తించారు. అలాగే తెలంగాణలో పింఛన్ పొందుతూ పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న 3,475 మందిని కూడా అధికారులు గుర్తించారు. డూప్లికేట్, ఇన్వాలిడ్ ఆధార్ కార్డుల కారణంగా మరో 10 వేల మంది పింఛన్లు చిక్కుల్లో పడ్డాయి.
గడువు వారం పొడిగింపు..
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం 19,04,239 మంది పెన్షనర్లు ఉండగా.. ఇప్పటివరకు 15,97,233 (83.88 శాతం) మంది అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు 83.88 శాతం ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయింది. మంచిర్యాల, ములుగు జిల్లాలు వంద శాతం అథెంటికేషన్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.
రంగారెడ్డి(53.92 శాతం), మేడ్చల్ మల్కాజిగిరి(60.5), హైదరాబాద్ (63.36) జిల్లాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రజాధనాన్ని కాపాడటంతో పాటు ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధుల కోసం అధికారులే వారి ఇంటికి వెళ్లి వేలిముద్రలు, ఐరిస్ సేకరిస్తున్నారు. అథెంటికేషన్ కోసం గడువును మరో వారం రోజులపాటు పొడిగించింది.
అనర్హుల పింఛన్ తొలగిస్తూనే.. మరోవైపు కొత్తగా 2 లక్షల పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, త్వరలోనే కొత్త లబ్ధిదారులకు కూడా పింఛన్లు అందుతాయని అధికారులు వెల్లడించారు.
