- గ్రేటర్లో యూఐడీఎఫ్ నిధులు రూ.551 కోట్లతో మరింత మెరుగ్గా డ్రికింగ్ వాటర్ సప్లై
- 2057 జనాభాకు అనుగుణంగా ఆఫీసర్ల ప్రపోజల్స్
- నాలుగు చోట్ల నీటి శుద్ధీకరణ ప్లాంట్లు
- 48 ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ ల నిర్మాణానికి కసరత్తు
- భవిష్యత్ లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రెడీ చేసింది.
ఈ మేరకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధులు రూ.551 కోట్లతో డ్రింకింగ్ వాటర్ సిస్టంను విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులను స్టడీ చేసిన ఆఫీసర్లు తొందర్లోనే పనులు స్టార్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
సరిపోని ట్యాంకులు, పైపులైన్లు..
గ్రేటర్ వరంగల్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ట్రై సిటీ చుట్టూరా కొత్త కాలనీలు ఏర్పడుతుండగా, చాలాచోట్ల దశాబ్దాల కింద వేసిన పైపులైన్లు, ట్యాంకులే ఉన్నాయి. గతంలో వరంగల్ నగరంలోని ప్రతి ఇంటికీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేందుకు 92 వాటర్ ట్యాంకులు, 27 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, దాదాపు 1,400 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది.
ఆ తర్వాత అర్బన్ మిషన్ భగీరథ, అమృత్ స్కీం కింద దాదాపు రూ.630 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థను డెవలప్ చేశారు. ఈ మేరకు కొత్తగా మరో 33 ట్యాంకులు, 158 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, 1,380 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ లైన్లు ఏర్పాటు చేశారు. అయినా రోజురోజుకూ పెరుగుతున్న కాలనీలకు వాటర్ ట్యాంకులు, పైపులైన్లు సరిపోని పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 2.5 లక్షల మేర ఇండ్లు ఉండగా, ప్రస్తుతం 172 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. వరంగల్ ట్రై సిటీలో ప్రతి ఇంటికి రోజూ తాగునీరు ఇవ్వాలనే డిమాండ్ ఉండగా, ప్రస్తుతం రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు.
2057 ప్రణాళికతో పనులు..
గ్రేటర్ వరంగల్ శివారుల్లో కొత్తకాలనీలు వెలుస్తుండగా, ఏటా నాలుగైదు వేల కొత్త ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వరంగల్ నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
2057 నాటికి వరంగల్ జనాభాకు సరిపడా నీటిని అందించేలా ప్రణాళిక తయారు చేశారు. ఇందుకు జీఎస్టీతో కలిపి రూ.551 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రపోజల్స్ పంపించారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా యూఐడీఎఫ్ నిధులతో పనులు చేపట్టేందుకు కసరత్తు చేశారు. ఈ మేరకు ది ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. దానిప్రకారం రెండేండ్ల కాలపరిమితిలోనే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతుండటం గమనార్హం.
48 ట్యాంకులు.. 4 డబ్ల్యూటీపీలు..
2057 జనాభాను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయగా, ఇందులో ప్రధానంగా నాలుగు చోట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ) ఏర్పాటు చేయనున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ తో పాటు వడ్డేపల్లి, దేశాయిపేట, కేయూ వద్ద ఉన్న ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు నెలకొల్పనున్నారు. వీటితో పాటు 48 చోట్ల కొత్తగా వాటర్ ట్యాంకులు కూడా నిర్మించనున్నారు.
నగరంలో కొన్నిచోట్ల వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరగా, వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు కూడా ప్రతిరోజు నీటిని సప్లై చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ లైన్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. పనులు తొందర్లోనే ప్రారంభమవుతాయని, అనుకున్న సమయంలోగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి నగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
