- పిల్లలను పట్టించుకోకపోతే ఎంత డబ్బున్నా వృథా
- స్కూల్స్ వద్ద చాక్లెట్లు, బిస్కెట్లలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయితో కుటుంబాలు కూలుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్.. ప్రస్తుతం పల్లెలకు కూడా పాకిందన్నారు. ఇంట్లో పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైతే వారి కుటుంబం మొత్తం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరికి వచ్చిన ఓ కేసులో రూ.3 వేల కోట్లు టర్నోవర్ ఉన్న ఒక ఫార్మా కంపెనీ అధిపతి ఇద్దరు పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిపారు.
మత్తు నుంచి బయటకు రాలేకపోతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా పిల్లలను పట్టించుకోకపోతే అది వృథానే అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో కలిసి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారి గురించి హెచ్చరించారు.
డ్రగ్స్ వినియోగంతో వచ్చే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. టెర్రరిజం, మావోయిజం, శాంతిభద్రతల సమస్యల కంటే ప్రమాదకరంగా ప్రస్తుతం డ్రగ్స్ సమస్య మారిందన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి సహా మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. కరోనా తర్వాత మత్తు పదార్థాల వినియోగం దేశంలో పెరిగిందని తెలిపారు. చిన్న పిల్లలు కూడా మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కూళ్ల సమీపంలోని పాన్ షాపుల్లో మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్, బిస్కెట్లను స్టూడెంట్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారని చెప్పారు. మత్తుపదార్థాల కట్టడికి పోలీస్ శాఖలోని డీజీపీ నుంచి హోంగార్డు వరకు నిబద్దతతో పనిచేయాలని, పోలీసులతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సైతం ఇందులో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యాసంస్థల్లో కట్టడికి కొత్త జీవో:
విద్యాసంస్థల్లో మత్తుపదార్థాల వినియోగానికి అడ్డుకట్ట వేసేలా స్కూల్స్, కాలేజీల యాజమాన్యాల బాధ్యతను పెంచేలా త్వరలోనే కొత్త జీవో తేబోతున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎలాంటి మత్తుపదార్థాలు వినియోగించబోమని విద్యాసంస్థలో చేరే ముందే విద్యార్థులతో అండర్ టేకింగ్ తీసుకునేలా కొత్త నిబంధనలు తేబోతున్నట్టు వెల్లడించారు. మత్తు ముఠాల కట్టడితోపాటు మత్తుపదార్థాల వినియోగంతో వచ్చే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితారానా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అజీజుద్దీన్, డీఆర్‌ఐ అడిషనల్ డీజీ హైదరాబాద్ జోనల్ యూనిట్ కుందూరు ఎస్‌వీవీ ప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
