సాంస్కృతిక, దేవాదాయ శాఖలు కలిసి ముందుకెళ్లాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాంస్కృతిక, దేవాదాయ శాఖలు కలిసి ముందుకెళ్లాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రవీంద్ర భారతిలో కళాకారులను సత్కరించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కళలు, సంస్కృతిని కాపాడుతూ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ శాఖలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘అర్థనారీశ్వరం నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్’ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొని, మాట్లాడారు.  గతంలో దేవాలయాలే కళలకు ప్రధాన వేదికలుగా ఉండేవని భట్టి గుర్తుచేశారు.

నృత్యాలు, కళారూపాల ద్వారా ప్రజలకు భక్తి, సామాజిక సందేశాలు చేరేవని చెప్పారు. కేరళలో ఉన్నట్లే తెలంగాణలో కూడా పర్యాటక ప్రాంతాల్లో స్థానిక కళల ప్రదర్శనలకు అవకాశం కల్పించే కొత్త విధానం తీసుకురావాలని సూచించారు. దీంతో కళాకారులకు ఉపాధి పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావులు సత్కరించారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.