- తొలి విడతలో 5 వేలకు పైగా పోస్టులు
- 3 వేల మంది టీచర్లు, 2వేల మంది ఆయాలు.. భర్తీకి కలెక్టర్లకు ఉత్తర్వులు
- జులై 1 నాటికి రిక్రూట్‌మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు
- మెరిట్ ప్రాతిపదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమారు 15వేలకు పైగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా.. దశల వారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5వేలకు పైగా టీచర్, ఆయా పోస్టులను తొలివిడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవలే సంతకాలు పెట్టినట్టు తెలుస్తున్నది.
ఈమేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ చివరి నాటికి.. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తున్నది.
తొలి విడతలో 5 వేల పోస్టులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలలో.. 6,399 అంగ న్వాడీ టీచర్ పోస్టులు, 7,834 ఆయా (హెల్పర్) పోస్టు లు మొత్తం 15 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీ లను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. తొలి విడతలో భాగంగా సుమారు 5 వేల కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3 వేల అంగన్వాడీ టీచర్ పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భర్తీ చేయనుండగా.. 2 వేల ఆయా పోస్టుల ను మాత్రం ప్రాధాన్యతా క్రమంలో తొలుత ఏజెన్సీ (ట్రైబల్) ప్రాంతాల్లోనే నింపనున్నారు. అంగన్వాడీ సెంటర్లలో ఆయాలు లేకపోవడంతో చిన్న పిల్లల సంరక్షణ, సెంటర్ల నిర్వహణ అంతా టీచర్లే చూసుకోవాల్సి వస్తున్నది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పారదర్శకంగా రిక్రూట్‌మెంట్..
గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటుచేసుకున్న విమర్శలకు తావులేకుండా ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది. స్థానిక, వివాహితలై ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్ లేదా పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఇచ్చి మెరిట్ లిస్టు రూపొందిస్తారు. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన మహిళలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత
రూపొందించిన ఫైనల్ మెరిట్ లిస్టు ఆధారంగా టీచ ర్లు, ఆయాలను నియమించనున్నారు.
