రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తా.. పంజాబ్‌ సీఎంకు గవర్నర్‌ హెచ్చరిక

రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తా..  పంజాబ్‌ సీఎంకు గవర్నర్‌ హెచ్చరిక

చండీగఢ్‌ : పంజాబ్‌ గవర్నర్‌ బన్వారిలాల్‌ పురోహిత్‌, సీఎం భగవంత్‌ మాన్‌ మధ్య లేఖల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్‌ బన్వారిలాల్‌ శుక్రవారం రోజు (ఆగస్టు 25న) ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వాలని, వ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని చెప్పారు. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతానన్నారు. ముఖ్యమంత్రికి పంపిన లేఖను గవర్నర్‌ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. 

గతంలో రాసిన లేఖలపై పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై తాను కలత చెందినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిస్తానంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం తాను తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే చర్యలు తీసుకోవాలని సీఎం మాన్‌కు సూచించారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు మరో మార్గం ఉండదన్నారు.

ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌ బన్వారిలాల్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కి చాలాసార్లు లేఖలు రాశారు. ఫిబ్రవరిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను సింగపూర్‌ పర్యటనకు ఎంపిక చేయడం సహా పలు అంశాలపై గవర్నర్‌ వివరాలు కోరారు. ఈ క్రమంలోనే గవర్నర్ కు, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు తలెత్తాయని తెలుస్తోంది.