LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ

LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ

బౌలరే.. తోటి బౌలర్లకు శతృవంటే నమ్ముతారా..! నమ్మాలి.. అది మరెవరో కాదు.. సునీల్ నరైన్. తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆల్‌రౌండర్‌గా పేరొందినా.. తొలి రోజుల్లో అతనొక సాదా సీదా బౌలర్. మరి ఇప్పుడు.. తోటి బౌలర్ల పాలిట శతృవు. బౌలింగ్‌తో మాయ చేయగలిగే నరైన్.. బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. క్రీజులో పాతుకుపోయి శివతాండవం ఆడుతున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన విండీస్ వీరుడు.. మరోసారి అలాంటి భయానక వాతావరణం సృష్టించాడు. ఆదివారం(మే 05) లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో  81 పరుగులు చేశాడు. అతని విధ్వంసం ధాటికి కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

కొట్టుడే కొట్టుడు

టాస్ ఓడి బ్యాటింగ్‪కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు  ఫిల్ సాల్ట్(32), సునీల్ నరైన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. లక్నో బౌలర్లను ఎడా పెడా వాయిస్తూ బౌండరీల మోత మోగించారు. వీరిద్దరి విధ్వంసానికి కోల్‌కతా 4 ఓవర్లలోనే 57 పరుగులు చేసింది. అనంతరం సాల్ట్ వెనుదిరిగినా.. నరేంద్రుడు తన బాదుడు మాత్రం ఆపలేదు. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. స్టోయినీస్ వేసిన 11వ ఓవర్‌లో ఏకంగా 3 సిక్స్ లు కొట్టాడు. చివరకు రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అనవరసపు షాట్‌కు యత్నించి తానే ఔటయ్యాడు.

నరైన్ వెనుదిరిగాక.. కోల్‌కతా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ర‌స్సెల్(12)ను నవీనుల్ హక్ బోల్తా కొట్టించగా.. అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(32)ని యుధ్వీర్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. చివరలో శ్రేయాస్ అయ్యర్(23), రింకూ సింగ్(16), రమణదీప్ సింగ్(25 నాటౌట్) పరుగులు చేశారు. 

లక్నో బౌలర్లలో బిష్ణోయ్ మినహా అందరూ విఫలమయ్యారు. స్టోయినిస్ 2 ఓవర్లలో 29, మొహ్సిన్ ఖాన్ 2 ఓవర్లలో 28, కృనాల్ పాండ్యా 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు.