పల్లీలు తిన్నట్టు ఇనుము తిన్నడు

పల్లీలు తిన్నట్టు ఇనుము తిన్నడు
  • కడుపు నుంచి 3.5 కిలోల సామాన్లు తీసిన డాక్టర్లు

42 రూపాయి బిళ్లలు, 26 నట్లు, బోల్టులు, 78 స్క్రూలు, స్ప్రింగ్​, ఒక నెయిల్​ కట్టర్​, ఓ అయస్కాంతం, చెవి దిద్దులు, గ్లాసు ముక్కలు, బ్లేడ్లు, 6 హెయిర్​ పిన్నులు, 17 పెన్ను క్యాపులు, 17 చొప్పున స్పూన్లు, రింగులు, పిన్నీసులు..  మొత్తం 3.5 కిలోల బరువున్న 452 ఇనుప సామాన్లు. ఇవీ వ్యక్తి కడుపులో నుంచి తీసిన సామాన్ల లెక్క. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని 28 ఏళ్ల ఓ వ్యక్తి వాటిని మింగాడు. కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో అతడి అమ్మానాన్న ఆస్పత్రికి తీసుకెళితే, ఇదిగో ఇవి బయటపడ్డాయి.  ఈ ఘటన గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగింది. ఆగస్టు 9న ఛాతి, కడుపు నొప్పి రావడంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడి నుంచి సివిల్​ హాస్పిటల్​లోని ఈఎన్​టీ డిపార్ట్​మెంట్​కు పంపించారు. అక్కడి డాక్టర్లు ఎక్స్​రే తీసి చూస్తే ఇనుప సామాను ఉన్నట్టు తేలింది. దీంతో నలుగురు డాక్టర్లు, రెండున్నర గంటల పాటు కష్టపడి బ్రాంకోస్కోపీ ద్వారా వాటిని తీసేశారు. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్లు వీటిని తింటూ ఉంటారని, దానిని ‘ఆక్యుఫేజియా’ అంటారని చెప్పారు. అయితే, పదేళ్ల క్రితం అతడికి పెళ్లయిందని, కూతురు కూడా ఉందని అతడి అమ్మ చెప్పారు. అయితే, కొన్నేళ్ల క్రితం అతడి నుంచి భార్య విడిపోవడంతో మానసికంగా బాగా కుంగిపోయాడని, దీంతో నాలుగేళ్లుగా మెంటల్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ ఇప్పిస్తున్నామని తెలిపారు.