అవకాశాలు క్లోజ్…ఈ సారి ఉరే

అవకాశాలు క్లోజ్…ఈ సారి ఉరే

నాలుగో సారి  డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా హౌజ్ కోర్టు
న్యాయ అవకాశాలు క్లోజ్…ఈ సారి ఉరి ఖాయమే
మా జీవితాల్లో కొత్త ఉదయమన్న నిర్భయ తల్లి
దోషులేమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించిన లాయర్ ఏపీ సింగ్?

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో దోషులకు ఉరి ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలంటూ ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 2 న దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించటంతో వారికున్న న్యాయ అవకాశాలన్నీ క్లోజ్ అయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం దోషులను ఉరి తీసేందుకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని పటియాలా కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన ట్రయల్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా మార్చి 20 న డేట్ ఫిక్స్ చేశారు. దోషుల తరఫు లాయర్ కూడా డెత్ వారెంట్ల జారీకి ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత ఉరి శిక్ష అమలు చేసేందుకు 14 రోజుల సమయం ఉండాలి. మార్చి 16  తో ఈ 14 రోజుల సమయం పూర్తి కానుంది. దీంతో ఈ నెల 20 న ఉరి తేదీని ఫిక్స్ చేశారు.

నాలుగో సారి డెత్ వారెంట్

నిర్భయ కేసులో దోషులకు డెత్ వారెంట్ జారీ చేయటం ఇది నాలుగోసారి.  తొలిసారి ఈ ఏడాది జనవరి 22 న, రెండో సారి ఫిబ్రవరి 1, మార్చి 3 న మూడోసారి డెత్ వారెంట్ జారీ చేశాక అవి వాయిదా పడ్డాయి. ఉరిని వాయిదా వేసేందుకు నిర్భయ దోషులైన అక్షయ్ కుమార్ ( 31), పవన్ గుప్తా (25) , వినయ్ శర్మ (26) , ముకేశ్ సింగ్ (32)  ల లాయర్లు శతవిధాలా ప్రయత్నించారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను వాడుకుంటూ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేయటంతో  దోషులకు శిక్ష ఆలస్యమవుతూ వచ్చింది. ముకేశ్‌‌‌‌ సింగ్, వినయ్‌‌‌‌ శర్మ, అక్షయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ క్షమాభిక్ష దరఖాస్తులను రాష్ట్రపతి ఇదివరకే తిరస్కరించారు. మార్చి 2 న పవన్ గుప్తా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ కారణంగా మార్చి 3 న వీరి ఉరి వాయిదా పడింది. వెంటనే రాష్ట్రపతి మెర్సీ పిటిషన్ ను తిరస్కరించటంతో ఇక దోషులకున్న అన్ని దారులు మూసుకుపోయాయి.  నలుగురు దోషుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌‌‌ను ఆదేశించాలంటూ దాఖలైన ఒక పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది.

మా జీవితాల్లో కొత్త ఉదయం

మార్చి 20 ఉదయం మా జీవితాల్లో మరో కొత్త ఉదయం అవుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్లు జారీ చేయటంపై ఆమె హ్యాపీ ఫీలయ్యారు.  ఈ సారి దోషులను కచ్చితంగా ఉరి తీస్తారని ఆమె ధీమాగా చెప్పారు.  వారిని ఉరి తీసే చివరి క్షణం వరకు మా పోరాటం కొనసాగుతుందని…మార్చి 20 నాటికి మా పోరాటం ముగుస్తుందని భావిస్తున్నానని అన్నారు.

కేంద్రం పిటిషన్ పై ఈ నెల 23 న విచారణ

గతంలో ఢిల్లీ హైకోర్టు నిర్భయ కేసులో దోషులందరినీ ఓకేసారి ఉరి తీయాల్సిందేనని జడ్డిమెంట్ ఇచ్చింది. అప్పట్లో దోషులు న్యాయ అవకాశాలను ఒక్కొక్కరుగా వినియోగించుకోవటంతో అందరికీ శిక్ష ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో దోషులను ఒక్కొక్కరిని ఉరి తీసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను  ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణను ఈ నెల 23 న విచారిస్తామని సుప్రీం తెలిపింది.  కేసు మెరిట్ ను బట్టి విచారణ ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే దోషులందరికీ ఉన్న న్యాయ అవకాశాలు క్లోజ్ అవటంతో మార్చి 20 నే వారిని ఉరి తీయనున్నారు. ఏ కారణం చేతనైనా శిక్ష వాయిదా పడితే సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది.

వాళ్లు టెర్రరిస్టులు  కాదు

మార్చి 20 న నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ పటియాల హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయటంపై అక్షయ్‌‌‌‌ సింగ్, పవన్‌‌‌‌ గుప్తాల తరఫున వాదిస్తోన్న లాయర్ ఏపీ సింగ్‌‌‌‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘దోషులకు నాలుగు సార్లు డెత్‌‌‌‌ వారెంట్లు  జారీచేసి, వారిని నాలుగు సార్లు చంపేశారు. వారేమీ టెర్రరిస్టులు  కాదు. భయంకరమైన నేరస్తులుగా చిత్రీకరించి మీడియా వారిని ఎప్పుడో చంపేసింది’ అని కామెంట్ చేశారు. నిర్భయ దోషులకు వేసే ఉరి న్యాయ వ్యవస్థ చేస్తున్న హత్యలని  అయన అన్నారు.  ఇప్పటికీ తమకు ఆల్టర్‌నేట్ అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. నిర్భయ దోషులకు శిక్ష ఆలస్యమవుతుండటానికి లాయర్ ఏపీ సింగ్ ప్రధాన కారణం. దోషులకు ఉన్న న్యాయ అవకాశాలను వాడుతూ ఓ దశలో దోషులకు ఉరి శిక్ష అమలు కాకుండా చేస్తానని ఆయన నిర్భయ తల్లి ఆశాదేవితో ఛాలెంజ్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషులను కాపాడే ప్రయత్నం చేయటంతో ఆయన పేరు చర్చనీయాంగా మారింది.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి