యునెస్కో మరో గుడ్‌ న్యూస్

యునెస్కో మరో గుడ్‌ న్యూస్

న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) భారత్‌కు మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. మూడ్రోజుల క్రితమే తెలంగాణలోని రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు ఇచ్చిన యునెస్కో .. ఇప్పుడు తాజాగా గుజరాత్‌లోని ధోలావీరాకు ఈ గౌరవాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘‘బ్రేకింగ్! ధోలావీరా: భారత్‌లో ఉన్న హరప్పా నాగరికత నాటి సిటీని ప్రపంచ వారసత్వ ప్రాంతాల లిస్ట్‌లో చేర్చాం. కంగ్రాట్స్” అంటూ మంగళవారం యునెస్కో తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది.


హరప్పా సిటీ నాగరికతకు సాక్ష్యం
భారత్‌లో ఉన్న అత్యంత ప్రాచీన ఆర్కియాలజీ సైట్స్‌లో ఒకటి ధోలావీరా. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో  ఉంది. హరప్పా నాగరికత నాటి వైభవానికి ప్రతీకగా నిలిచే ప్రాంతమిది. భారత్‌లో క్రీస్తు పూర్వం దాదాపు 3 వేల ఏండ్ల క్రితమే ఎంతో అద్భుతమైన నాగరికత, సిటీలు ఉండేవనేందుకు ధోలావీరాలోని శిథిలాలు సాక్ష్యంగా ఉన్నాయి.  క్రీస్తుపూర్వం 2 వేల 650 నుంచి 2 వేల 550 వరకు హరప్పా నాగరికత ఎర్లీ స్టేజ్ ఇక్కడ జరిగినట్టు చారిత్రక ఆధారలున్నాయి. ఉథ్థానం నుంచి పతనం వరకు ఐదు దశలుగా హరప్పా నాగరికత ఇక్కడ దాదాపు 800 సంవత్సరాలు నడిచింది. తర్వాత వచ్చిన వరుస కరవు కాటకాల వల్ల క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచి 1850 మధ్య పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. నాటి చరిత్రకు సంబంధించిన శిధిలాలను  1967–68 మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పట్లో డైరెక్టర్ జనరల్‌గా ఉన్న జేపీ జోషి తొలిసారి గుర్తించారు. హరప్పా నాగరికతలో ధోలావీరా ఐదో అతి పెద్ద సిటీ. 1990 నుంచి ఆర్కియాలజీ వాళ్లు ఇక్కడ తవ్వకాలు జరిపారు.