కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నది: హరీశ్ రావు

కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నది: హరీశ్ రావు
  • జూబ్లీహిల్స్ ప్యాలెస్​లో సీఎం చోద్యం చూస్తున్నడు: హరీశ్ రావు
  •     665 టీఎంసీలను ఏపీ వాడుకుంటే సీఎం, ఇరిగేషన్​ మంత్రి ఏం చేస్తున్నరు?
  •     కృష్ణా బోర్డు మాత్రం 555 టీఎంసీలే తీసుకెళ్లిందని చెప్తున్నది
  •     బీజేపీ ప్రభుత్వం చేతిలో బోర్డున్నా..కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, సంజయ్​ ఏం చేస్తున్నరు
  •     అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం సీఎం రేవంత్ ఎందుకు డిమాండ్ చేయట్లే
  •     త్వరలో కృష్ణా బోర్డును ముట్టడిస్తం.. పార్లమెంట్​లో లేవనెత్తుతమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతుంటే.. జూబ్లీహిల్స్ ప్యాలెస్​లో కూర్చుని సీఎం చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. జనవరి 28 నాటికే ఏపీ ఎలాంటి ఇండెంట్లు లేకుండా 665 టీఎంసీలు వాడుకున్నదని, 80 శాతం నీళ్లను తీసుకెళ్లిపోయిందని చెప్పారు. ఏపీ ఇంతలా నీళ్లను తీసుకెళ్తుంటే.. సీఎం, ఇరిగేషన్​ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణా బోర్డుకు జనవరి 28న ఈఎన్​సీ లేఖ రాశారని, ఆ తర్వాత 31న ఆయన రిటైర్​ అయ్యారని గుర్తు చేశారు. ఈఎన్​సీ రిటైర్​ అయ్యాక వారం పాటు కొత్త ఈఎన్​సీని ప్రభుత్వం నియమించలేదన్నారు. కృష్ణా బోర్డు మెంబర్​గా ఆయనే ఈ అంశాన్ని బోర్డు వద్ద లేవనెత్తాల్సి ఉంటుందని, అయినప్పటికీ వారం పాటు ఆ పోస్టును ప్రభుత్వం ఖాళీ పెట్టడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. వాటా కుదరలేదా.. మాట కుదరలేదా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతం నీళ్లను వాడుకోవాల్సి ఉన్నా.. 80 శాతం వాడేసిందన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేంద్రాన్ని సీఎం ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. గురువున్నాడనే రేవంత్​కు భయం పట్టుకుందని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​ నుంచి ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే.. ప్రభుత్వం కండ్లు మూసుకున్నదన్నారు. ఇప్పటికీ ఏపీ రోజూ 1.5 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన పంటలు ఏమైపోతాయని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఇంకా 174 టీఎంసీలు వాడుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ఈ ఏడాది కేవలం 20 శాతం నీళ్లే సర్కారు వాడిందని, సీఎం వైఫల్యానికి ఇది నిదర్శనమన్నారు.

కేఆర్​ఎంబీవి తప్పుడు లెక్కలు..

ఏపీ 665 టీఎంసీలు తీసుకుపోయిందని కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ లేఖ రాస్తే.. బోర్డు మాత్రం కేవలం 555 టీఎంసీలే తీసుకెళ్లినట్లు చెబుతోందని హరీశ్​ రావు అన్నారు. కృష్ణా బోర్డు 100 టీఎంసీలు తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబీ బీజేపీ ప్రభుత్వం చేతుల్లో ఉందని, రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్.. కేసీఆర్ మీదపడి ఏడ్వడం తప్ప ఏం చేస్తున్నారని నిలదీశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు గొంతెత్తడం లేదని ప్రశ్నించారు. ఆర్ఆర్​ ట్యాక్స్​ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో రేవంత్​ కూడా మౌనంగా ఉంటున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్​ద్రోహం చేస్తున్నాయన్నారు. రేవంత్, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా అని మండిపడ్డారు. చంద్రబాబు, రేవంత్​కు మధ్య ఫెవికాల్​ బంధం ఉండి ఉండొచ్చని, అయినా కూడా రాష్ట్ర హక్కులను ఎందుకు ఆంధ్రాకు రాసిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై అవసరమైతే ఢిల్లీలోని కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తామన్నారు. కేంద్ర మంత్రిని కలుస్తామని, పార్లమెంట్​లోనూ లేవనెత్తుతామని చెప్పారు. టెలిమెట్రీల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 19 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేసిందని, మరో 9 చోట్ల పెట్టాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు.