ట్రెయిన్‌ టికెట్లను క్యాన్సిల్‌‌ చేయడం ఇలా..

ట్రెయిన్‌ టికెట్లను క్యాన్సిల్‌‌ చేయడం ఇలా..

న్యూఢిల్లీ: రైల్వే టికెట్లను ఆన్‌‌లైన్‌‌లో బుక్‌‌ చేసుకోవడానికి ఐఆర్‌‌సీటీసీ ఒక్కటే మార్గం. చాలా సైట్లు రైల్వే టికెట్ల బుకింగ్‌‌ సేవలను అందిస్తున్నా, అవి చివరికి ఐఆర్‌‌సీటీసీ సర్వర్‌‌ ద్వారానే బుక్‌‌ అవుతాయి. టికెట్లు కేన్సిల్‌‌ చేసుకుంటే ఐఆర్‌‌సీటీసీ భారీగా కేన్సిలేషన్‌‌ ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే ఇవి రకరకాలుగా ఉంటాయి. రైలు చార్టు తయారీకి ముందు కేన్సిల్‌‌ చేస్తే తక్కువ చార్జీ,  కన్ఫార్మ్‌‌ టికెట్‌‌లను కేన్సిల్‌‌ చేసుకుంటే మరింత ఎక్కువ ఫైన్‌‌ పడుతుంది.  ఉదాహరణకు ఏసీ ఫస్ట్‌‌ క్లాస్‌‌ టికెట్ కేన్సిల్‌‌ చేస్తే రూ. 240 ఛార్జ్ ఉంటుంది.  ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ-టైర్, ఏసీ త్రీ-టైర్ వంటి టికెట్ల  క్లాసులపై  క్యాన్సిలేషన్‌‌ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌‌సీటీసీ) ప్రకటించింది. 

రైళ్ల చార్ట్ తయారీకి ముందు ఈ–టికెట్ల  క్యాన్సిలేషన్‌‌ ఛార్జీలు: కేన్సిలేషన్‌‌ చేసిన సమయం, అప్పుడు రైలు టికెట్ స్టేటస్‌‌ ఆధారంగా  క్యాన్సిలేషన్‌‌ చార్జీ వసూలు చేస్తారు.
1. కన్ఫార్మ్‌‌ టికెట్లను ట్రైన్ బయలుదేరడానికి 48 గంటల కంటే ముందుగానే ఆన్‌‌లైన్‌‌లో కేన్సిల్‌‌ చేస్తే  క్యాన్సిలేషన్‌‌ ఛార్జీలు ఇలా ఉంటాయి:
ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లకు రూ .240  
ఏసీ టూటైర్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్లకు రూ .200 
ఏసీ త్రీ టైర్ లేదా ఏసీ చైర్ కార్ లేదా ఏసీ 3 ఎకానమీ క్లాస్ టికెట్లకు రూ .180  
స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ .120  
సెకండ్‌‌ క్లాస్‌‌కు రూ .60  
2. కన్ఫార్మ్‌‌  టికెట్ రైలు బయల్దేరే 48 గంటలలోపు లేదా  రైలు షెడ్యూల్‌‌ డిపార్చర్‌‌కు 12 గంటలలోపు కేన్సిల్‌‌ చేసుకుంటే ఛార్జీలు టికెట్‌‌ ధరపై 25 శాతం ఉంటాయి. అన్ని ఏసీ క్లాసులకు జీఎస్టీ వర్తిస్తుంది.
3. కన్ఫార్మ్‌‌ రైలు టికెట్‌‌ను రైలు బయల్దేరడానికి 12 గంటలలోపు కేన్సిల్‌‌ చేసుకుంటే  టికెట్‌‌ ఛార్జీలో 50 శాతం మొత్తాన్ని మాత్రమే వాపసు ఇస్తారు. అన్ని క్లాసుల టికెట్లకు జీఎస్టీ వర్తిస్తుంది. 
4.  కన్ఫార్మ్‌‌ రిజర్వేషన్‌‌ టికెట్‌‌ను రైలు కదిలిన తరువాత కూడా కేన్సిల్‌‌ చేయకున్నా, ఆ తరువాత నాలుగు గంటలోపు టీడీఆర్‌‌ (టికెట్‌‌ డిపాజిట్‌‌ రిసీట్‌‌) ఫైల్‌‌ చేయకున్నా, ఒక్క రూపాయి కూడా వాపసు ఇవ్వరు. 

కేన్సిల్‌ ప్రాసెస్‌

  • ముందుగా ఐఆర్‌‌సీటీసీ -ఈ–టికెటింగ్ వెబ్‌‌సైట్‌‌ https://www.irctc.co.in/nget/train-searchకు వెళ్లాలి. లాగిన్‌‌ ఆప్షన్‌‌పై క్లిక్‌‌ చేయగానే పాప్‌‌ అప్ బాక్స్‌‌ వస్తుంది. అందులో ఐడీ, పాస్‌‌వర్డ్‌‌ టైపు చేసి లాగిన్ కావాలి.
  • 'మై ట్రాన్సాక్షన్స్‌‌ కి వెళ్లి, ‘మై అకౌంట్‌‌’ మెనూలోని 'టికెట్‌‌ హిస్టరీ' అనే లింక్‌‌పై క్లిక్ చేయండి.
  • బుక్ చేసుకున్న టికెట్ల వివరాలు కనిపిస్తాయి. వద్దనుకున్న టికెట్‌‌‌‌ని ఎంచుకుని 'క్యాన్సిల్‌‌ ది టికెట్‌‌' ఆప్షన్‌‌ పై క్లిక్ చేయాలి.
  • టికెట్‌‌ వద్దనుకుంటున్న ప్యాసింజర్లను పేర్లను ఎంచుకోవాలి. ప్యాసింజర్ల పేరుకు ముందు ఉన్న చెక్ బాక్స్‌‌ని ఎంచుకుని, ‘టికెట్ క్యాన్సిల్‌‌’ బటన్‌‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ‘కన్ఫర్మేషన్‌‌’ పాప్-అప్ బాక్స్‌‌ వస్తుంది. క్యాన్సిలేషన్‌‌ను నిర్ధారించడానికి 'ఓకే' బటన్‌‌ని నొక్కాలి.
  • క్యాన్సిలేషన్‌‌ పూర్తయిన తర్వాత, క్యాన్సిలేషన్‌‌ చార్జీల మొత్తం తీసేయగా, మిగిలిన రీఫండ్ మొత్తం కనిపిస్తుంది. 
  • క్యాన్సిలేషన్‌‌ వివరాలన్నీ రిజిస్టర్డ్‌‌ మొబైల్ నంబర్‌‌కు వస్తాయి. ఈ–మెయిల్ ఐడీకి కూడా సమాచారం వస్తుంది. 
  • కొందరు ప్యాసింజర్ల టికెట్లను మాత్రమే క్యాన్సిల్‌‌ చేస్తే, ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్యాసింజర్ల కోసం ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ (ఈఆర్‌‌ఎస్‌‌)  తాజా ప్రింట్ అవుట్​ను తప్పకుండా తీసుకోవాలి.