పెద్ద చదువులు ప్రైవేటు గుప్పిట్ల

పెద్ద చదువులు ప్రైవేటు గుప్పిట్ల

రాజకీయ నేతలు, బడాబాబులే ఓనర్లు
ఇప్పటికే ఐదు ప్రైవేట్​ వర్సిటీలు.. మరో ఆరింటికి అనుమతి
సర్కారు వద్ద రెడీగా మరో ఐదు  వర్సిటీల ప్రతిపాదనలు
ప్రైవేట్​లో ఇష్టమున్నట్లు ఫీజులు.. అర్రాస్​ లెక్క సీట్ల అమ్మకాలు.. 
నో రిజర్వేషన్​ నిధులు, నియామకాలు లేక ఆగమవుతున్న సర్కారు వర్సిటీలు 
ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టూడెంట్లు, విద్యావేత్తలు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నత విద్య క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నది. ఇప్పటికే ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా.. తాజాగా కేబినెట్​ మరో ఆరు యూనివర్సిటీలకు అనుమతులిచ్చింది. ఇంకో ఐదు వర్సిటీల ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి. వీటిలో మూడింటికి త్వరలోనే పర్మిషన్​ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే  ఒకటీ, రెండేండ్లలోనే రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీల కన్నా ప్రైవేటు వర్సిటీల సంఖ్యనే ఎక్కువ కానుంది. రాజకీయ నాయకులు, బడాబాబుల చేతుల్లో ఉండే ప్రైవేట్​ యూనివర్సిటీల్లో వాళ్లు నిర్ణయించిందే ఫీజవుతుంది. రిజర్వేషన్లు అమలు కావు. మెరిట్​ ఆధారంగా వచ్చే సీట్లు మార్కెట్​లో వేలంపాట లెక్క పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వక, నియామకాలు చేపట్టక సర్కార్​ యూనివర్సిటీలను రాష్ట్ర  ప్రభుత్వం ఆగం చేస్తున్నదని, బడాబాబుల చేతుల్లో ఉండే ప్రైవేటు వర్సిటీలకు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పర్మిషన్లు ఇస్తూ పోతున్నదని వారు మండిపడుతున్నారు. 

అమిటీ, ఎంఎన్​ఆర్​, గురునానక్​, నిక్మార్​, కావేరీ (అగ్రీ వర్సిటీ), సీఐఐ (కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ) యూనివర్సిటీలకు రాష్ట్ర సర్కార్​ తాజాగా అనుమతులిచ్చింది. ఇందులో ఓ యూనివర్సిటీకైతే పర్మిషన్​ ఎలా వచ్చిందో తమకే తెలియదని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఎస్కీ) , విజ్ఞాన్, శ్రీనిధి వర్సిటీలతో పాటు మరో రెండు వర్సిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు సర్కారు వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు, మూడు యూనివర్సిటీలకు త్వరలోనే పర్మిషన్​ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీలకన్నా ప్రైవేటు వర్సిటీ సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 11 యూనివర్సిటీలున్నాయి. కొత్తగా కోఠి విమెన్స్​ కాలేజీ మహిళా వర్సిటీగా మారనుంది. అంటే విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలు పన్నెండు. ప్రైవేటులో ఇప్పుడు ఐదు వర్సిటీలుండగా.. కొత్తగా ఆరింటికి కేబినెట్​ అనుమతిచ్చింది.  మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు పర్మిషన్​ కోసం ఎదురుచూస్తున్నాయి. 

ప్రైవేటులో అంతా ఇష్టారాజ్యం

ప్రైవేటు వర్సిటీల్లో ఫీజుల కంట్రోల్​ సర్కారు చేతిలో ఉండదు. వర్సిటీ మేనేజ్​మెంట్లే ఫీజులను నిర్ణయించుకుంటాయి. వీటిలో ప్రస్తుతం ఏటా ఒక్కో కోర్సుకు రూ.50 వేల నుంచి 3 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు, మూడేండ్లలో ఫీజును డబుల్ చేసే అవకాశముంది. ప్రైవేట్​  వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలూ ఉండదు. మేనేజ్​మెంట్లు తమకు ఇష్టమొచ్చిన వారికి సీట్లను అలాట్ చేసుకుంటాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లు లోకల్ స్టూడెంట్లకు ఇస్తామని యాక్ట్ లో తెలిపారు. ఇది చూసి చాలామంది తెలంగాణ వాళ్లకు కొన్నయినా సీట్లు వస్తాయని ఆశపడ్డారు. కానీ తెలంగాణలో రెండేండ్లు చదివినా, రెండేండ్లు ఉన్నా లోకల్​గానే  పరిగణిస్తామని చట్టంలో పేర్కొన్నారు. స్టూడెంట్ల పేరెంట్స్​ ఎక్కడి వారైనా, వారు ఇక్కడ రెండేండ్లు పనిచేస్తే వారికీ ఈ లోకల్ కోటా వర్తిస్తుంది. మరోపక్క ల్యాండ్స్, డిపాజిట్ల విషయంలోనూ మేనేజ్మెంట్లకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. 

సర్కారు వర్సిటీలను పట్టించుకుంటలే

సర్కార్​ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వర్సిటీల్లోని సిబ్బందికి కనీసం జీతాలకు సరిపడా బడ్జెట్​ను కూడా ఇవ్వడం లేదు. దేశంలోనే పేరున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది రూ.789 కోట్లకు ప్రపోజల్స్ పంపిస్తే.. ప్రభుత్వం రూ. 418 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. కాకతీయ యూనివర్సిటీ రూ.300 కోట్లు అడిగితే 118 కోట్లు, పాలమూరు యూనివర్సిటీ రూ.108 కోట్లు అడిగితే 9.85 కోట్లు, జేఎన్టీయూహెచ్​ రూ.60 కోట్లు అడిగితే 44 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీ రూ.60 కోట్లు అడిగితే 35 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. రెండేండ్ల నుంచి డెవలప్​మెంట్​ ఫండ్​ కూడా ఇవ్వడం లేదు. మరోపక్క సర్కారు యూనివర్సిటీల్లో ఏండ్ల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా  3,500 పోస్టులను భర్తీ చేస్తామని, దానికి కామన్​ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వాస్తవానికి వర్సిటీల్లో టీచింగ్ 2,020, నాన్ టీచింగ్ 2,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 4,794 పోస్టుల్లో 3,500 మాత్రమే ఉన్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు తగ్గిస్తారనే ఆందోళన సర్కారు యూనివర్సిటీల్లో పెరిగింది. 

ప్రైవేట్​ వర్సిటీలు ఇట్లా ఎంటరైనయ్​

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2018’ను తీసుకొచ్చింది. అప్పట్లో 11 సంస్థలు యూనివర్సిటీల ఏర్పాటుకు అప్లయ్​ చేసుకున్నాయి. వీటిలో 9 వర్సిటీలకు కేబినెట్ సబ్ కమిటీ  ఓకే చెప్పినా, 2020–21లో మాత్రం ఐదు వర్సిటీలకు సర్కారు అనుమతించింది. ఇందులోని మహింద్రా యూనివర్సిటీ, వోక్సెన్‌ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, అనురాగ్‌ యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ ముందుగా మహిళా వర్సిటీగా పేర్కొన్నా, తర్వాత జనరల్ యూనివర్సిటీగా మార్చారు. అయితే అప్పట్లో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడాన్ని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సర్కారు మాత్రం వెనక్కి తగ్గలేదు. నిబంధనలను మేనేజ్మెంట్లకు అనుకూలంగా మార్చి మరీ, అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మరో ఆరింటికి పర్మిషన్​ ఇచ్చారు. 

ఐదింట్లో మూడు టీఆర్​ఎస్​ లీడర్లవే..

రెండేండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ఐదు ప్రైవేటు యూనివర్సిటీల్లో మూడు టీఆర్​ఎస్​ లీడర్లవే. అందులో ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందింది. మరొకటి అనురాగ్ యూనివర్సిటీ. ఇది ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందింది. ఇంకోటి  ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇది గతంలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వరదారెడ్డికి చెందింది. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీని ముందుగా మహిళా వర్సిటీగా పర్మిషన్​ తీసుకున్నారు. ఆ తర్వాత జనరల్​ వర్సిటీగా మార్చుకున్నారు. దీంతో కోఠి ఉమెన్స్​ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చాలనే  గతంలోని ప్రతిపాదనకు ఇప్పుడు కేబినెట్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అంటే మల్లారెడ్డి వర్సిటీకి జనరల్​ వర్సిటీ స్టేటస్​ వచ్చే వరకు కోఠి ఉమెన్స్​యూనివర్సిటీ ప్రతిపాదన పెండింగ్​లో ఉండిపోయిందన్నమాట. ఉన్నత విద్యారంగంలోకి లీడర్లు, బడాబాబులు ఎంటరైతే ప్రతిపాదనలు ఎలా తారుమారవుతాయో అనే దానికి ఇదొక నిదర్శనమని కొందరు అధికారులు అంటున్నారు. కొత్తగా వచ్చే ఆరు ప్రైవేట్​ యూనివర్సిటీల్లోనూ లీడర్లు, బడాబాబులవే ఉన్నట్లు తెలుస్తున్నది. 

పర్మిషన్ వెనక్కి తీసుకోవాలె

రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ప్రైవేటు వర్సిటీలుండగా, ఇంకా 6 వర్సిటీలకు పర్మిషన్ ఇవ్వడం దారుణం. సర్కారు యూనివర్సిటీల్లో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకుండా, నిధులు ఇవ్వకుండా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యను మార్కెట్ సరుకుగా మార్చే ప్రైవేటు వర్సిటీలతో రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు.  ప్రైవేట్​ వర్సిటీల్లో ఫీజుల నియంత్రణ ఉండదు. రిజర్వేషన్లు అమలు కావు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ఇచ్చిన  6 వర్సిటీల పర్మిషన్​ను వెనక్కి తీసుకోవాలి. 
‑ ఆర్​ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్

ఇదంతా కుట్రలో భాగమే

టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వర్సిటీలకు అరకొర నిధులే కేటాయిస్తున్నది. టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేపట్టలేదు. కావాలనే ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయడం కుట్రనే. పొలిటికల్ లీడర్లు ఇంజనీరింగ్ కాలేజీలను ప్రైవేటు వర్సిటీలుగా మార్చుకుంటూ, సర్కారు కంట్రోల్​లో నుంచి తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. సర్కారు వర్సిటీలకు నిధులిచ్చి వాటిని  బలోపేతం చేయాలి. 
- ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ