రాహుల్​ను ప్రధానిని చేసేందుకు పాక్​ కష్టపడుతోంది : మోదీ

రాహుల్​ను ప్రధానిని చేసేందుకు పాక్​ కష్టపడుతోంది :   మోదీ
  • ఇక్కడ ఆ పార్టీ చచ్చిపోతుంటే.. అక్కడ ఏడుపు
  • యూపీఏ గెలవాలని పాకిస్థాన్​లో ప్రార్థనలు..
  • ఇద్దరి మధ్య బంధం బయటపడ్డది
  • గుజరాత్ ర్యాలీలో ప్రధాని ఫైర్

ఆనంద్ (గుజరాత్):  దేశంలో కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడి ఉనికి కోల్పోతుంటే.. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఏడుస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ యువ రాజు అయిన రాహుల్.. ప్రధానమంత్రి కావాలని ఆ దేశ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఇండి యాలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని పాకిస్తాన్ కోరుకుంటున్నదని విమర్శించారు. కాంగ్రెస్, పాకిస్తాన్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సెంట్రల్ గుజరాత్​లోని ఆనంద్ టౌన్, జునాగఢ్, సురేంద్రనగర్​లో నిర్వహించిన ఎన్నికల మెగా ర్యాలీల్లో మోదీ పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అంటే పాకిస్తాన్​కు ఎంతో ఇష్టం. అందుకే ఇండియాలో మళ్లీ కాంగ్రెస్ సర్కార్ రావాలని ఆ దేశం గట్టిగా కోరుకుంటున్నది. రాహుల్​ను ఇండియా ప్రధానిగా చూడాలనుకుంటున్నది. అందుకే ఆ దేశ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రాహుల్​ను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘రాహుల్ ఆన్ ఫైర్’ అంటూ కామెంట్లు చేశాడు. యూపీఏ హయాంలో మన దేశానికి సంబంధించిన కీలక ఫైళ్లు పాక్​ టెర్రరిస్టులకు చేరేవి. కానీ.. ఎన్​డీఏ అధికారంలోకి వచ్చాక అదే పాకిస్తాన్ గడ్డ మీదున్న టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఇండియాలో కాంగ్రెస్ చచ్చిపోతుంటే.. పాకిస్తాన్ ఏడుస్తున్నది’’ అని విమర్శించారు.

నకిలీ వస్తువుల తయారీ ఫ్యాక్టరీగా కాంగ్రెస్

పాకిస్తాన్​కు కాంగ్రెస్ పెద్ద అభిమాని అని మోదీ ఆరోపించారు. ఇప్పుడు వారి మధ్య ఉన్న భాగస్వామ్యం బహిర్గతమైందని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రేమను పంచుతోందంటూ ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నరు. నకిలీ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీగా కాంగ్రెస్ మారింది. కాంగ్రెస్ వెనుక పాకిస్తాన్ ఉందన్న విషయం చాలా మందికి తెల్వదు. ఇండియాలో బలహీన ప్రభుత్వం ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నరు. 26/11 ముంబై దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌‌ గెలవాలి.. రాహుల్ ప్రధాని కావాలని పాక్‌‌ నేతలు దువా చేస్తున్నరు’’ అని మోదీ విమర్శించారు. దేశాన్ని ఏకం చేయాలని తాము ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ ఆలోచనలు ఎంతో ప్రమాదకరం

ప్రస్తుతం జరుగుతున్న లోక్​సభ ఎన్నికలు తన వ్యక్తిగత ఆశయాలు నెరవేర్చేందుకు కాదని.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అని మోదీ అన్నారు. ఇండియాతో పాటు ప్రపంచానికి కూడా బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఎంతో ముఖ్యమని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ఆలోచనలు చాలా ప్రమాదకరమైనవి. ఆ పార్టీ మేనిఫెస్టోను ముస్లింలీగ్ లాంగ్వేజ్​లో రాశారు. మతపరమైన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది’’ అని మండిపడ్డారు.

ఓటు జిహాద్.. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే..

సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీలక నేత, సల్మాన్ ఖుర్షిద్ మేనకోడలు మరియా ఆలం చేసిన ఓట్ జిహాద్ కామెంట్లపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘ఇండియా కూటమి చేసిన ప్లాన్‌‌ను మరియా ఆలం బయటికి చెప్పారు. ముస్లింలు ఓట్ జిహాద్‌‌కి వెళ్లాలని.. అందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కోరారు. మదర్సా నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి కాకుండా.. ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఆమె చేసిన కామెంట్లను కూటమి నేతలెవరూ ఖండించలేదు. ఒక వైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.. మరోవైపు ఓట్ జిహాద్ నినాదాన్ని లేవనెత్తుతున్నది. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అయిపోయింది.. ఇప్పుడు ఓటు జిహాద్ వచ్చింది’’అని మోదీ మండిపడ్డారు. ఒకప్పుడు రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ లీడర్లు.. ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని నెత్తిమీద పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.