షిండే శిబిరంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

షిండే శిబిరంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది.మరోవైపు రెబెల్ గా మారిన ఏక్ నాథ్ షిండే శిబిరంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. దీంతో శివసేన కాస్త షిండే సేనగా మారిపోయినట్లుగా పరిణామాలు మారుతున్నాయి. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లోకి ఇవాళ ఉదయం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఏక్ నాథ్ షిండే క్యాంప్ లోకి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్లతో కలిపి తనకు 46 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం పడిపోతే ఏం జరుగుతుందన్న విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. షిండే వర్గంతో బీజేపీతో జట్టు కడితే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమే అంటున్నారు. కరోనా పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఉద్ధవ్ థాక్రే రూల్స్ బేఖాతరు చేశారని, అధికారిక నివాసం ఖాళీ చేసేప్పుడు పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే విషయంపై కంప్లైంట్ కూడా చేశారు.

ఓ వైపు మహారాష్ట్ర CM ఉద్దవ్ థాక్రే... అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఆయన కుటుంబంతో సహా ఖాళీ చేసి వెళ్తున్న టైంలో అభిమానులు పూల వర్షం కురిపించారు. ఉద్ధవ్ థాక్రేకు అనుకూలంగా నినాదాలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నిన్న ఉద్వేగంగా మాట్లాడారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. శివసైనికులను మోసం చేయొద్దన్నారు. తన ముందుకొచ్చి రాజీనామా చేయాలని అడగితే రిజైన్ చేసేవాడ్ని అన్నారు. సీఎం పదవిని.. పార్టీ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నానన్నారు. తన తర్వాత ఏ శివసైనికుడు సీఎం అయినా సంతోషమేనన్నారు థాక్రే. ప్రస్తుత రాజకీయ పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములైన NCP,  కాంగ్రెస్ తనను సీఎంగా వద్దనుకుంటే అది వేరన్నారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు ఏం చేయగలని ఆవేదన వ్యక్తం చేశారు థాక్రే.