నేటి(సెప్టెంబర్ 02) నుంచి హెచ్ఎండీఏ భూముల వేలం..నేడు మోకిలా, బాచుపల్లిలో 35 ప్లాట్ల చొప్పున ఆక్షన్

నేటి(సెప్టెంబర్ 02) నుంచి హెచ్ఎండీఏ భూముల వేలం..నేడు మోకిలా, బాచుపల్లిలో 35 ప్లాట్ల చొప్పున ఆక్షన్
  •     భారీ ధర వస్తుందని అంచనాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు:  నగరంలో బుధవారం నుంచి హెచ్ఎండీఏ భూముల వేలం మళ్లీ మొదలవనుంది. వేలాన్ని 9వ తేదీ వరకు నిర్వహించనున్నామని, మోకిలా, బాచుపల్లితోపాటు కోకాపేట, ఇన్ముల్​నర్వ, సిటీలోని మరికొన్ని కీలక ప్రాంతాల్లో చిన్న బిట్ల వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రీబిడ్ సమావేశాలకు పలు ప్రముఖ కంపెనీలు, రియల్ ఎస్టేట్​వ్యాపారులు, బిల్డర్లు హాజరు కావడంతో ఈసారి అనుకున్న టార్గెట్​కంటే భారీగా ఆదాయం సమకూరుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

గతంలో లక్షకు పైనే..

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని మోకిలతోపాటు బాచుపల్లిలో బుధవారం 35 చొప్పున ప్లాట్లను వేలం వేయనున్నారు. మొకిలాలో సర్వే నంబర్​96/పిలో 165 ఎకరాల 37 గంటల ప్రభుత్వ భూమిలో అపార్ట్​మెంట్స్​, ఇండిపెండెంట్​ ఇండ్లు నిర్మించుకునేందుకు 1,293 ప్లాట్లను డెవలప్​చేశారు. వీటిలో 100 ప్లాట్లను జూన్​30న వేలం వేయగా మంచి స్పందన వచ్చింది. కనీస ధర చదరపు గజానికి రూ.50 వేలుగా నిర్ణయించగా రూ.1,09,500 పలికింది. ఇప్పుడు 300 నుంచి 500 గజాల ప్లాట్లను రెడీ చేసి ఒక్కో ప్లాట్​కు కనీస ధర రూ.55వేలుగా నిర్ణయించారు. ఈసారి గజానికి లక్షన్నర పైగానే పలికే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, హైటెక్​సిటీకి సమీపంలోనేని బాచుపల్లి సర్వే నంబర్​39, 40లలో  ఇండిపెండెంట్​ఇండ్లు, ఆఫీసులు, అపార్ట్​మెంట్ల నిర్మాణానికి అనుకూలంగా 266.67 చదరపు గజాల నుంచి 499.96 చదరపు గజాల సైజుల్లో 35 ప్లాట్లను వేలం వేస్తున్నారు. ఇక్కడ కనీస ధర రూ.45 వేలు నిర్ణయించగా, భారీ ధర వస్తుందని భావిస్తున్నారు.