ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్​కు చేరతాయ్

ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్​కు చేరతాయ్
  • డిమాండ్​ జోరు ఏమాత్రం తగ్గలేదు
  • ఎనరాక్​ రిపోర్టు

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్​కు చేరతాయని ఒక రిపోర్టు వెల్లడించింది.   ఏడు సిటీలలోనూ గిరాకీ ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు 3.6 లక్షల యూనిట్లకు చేరడం ఖాయమని ప్రాపర్టీ కన్సల్టింగ్​​కంపెనీ  ఎనరాక్​ రిపోర్టు తెలిపింది. ఓ వైపు వడ్డీ రేట్లు, ప్రాపర్టీల రేట్లు పెరుగుతున్నప్పటికీ గిరాకీ ఊపందుకోవడం విశేషమని పేర్కొంది. ఇంతకు ముందు 2014 లో  ఏడు ప్రధాన సిటీలలోనూ కలిపి  అత్యధికంగా 3,42,980 ఇండ్లు అమ్ముడయ్యాయి.  ఢిల్లీ–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​, కోల్​కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​, పుణెలను ఏడు ప్రధానమైన సిటీలుగా ఎనరాక్​ పరిగణిస్తోంది. 

ఎనరాక్​ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్​ మధ్య కాలంలో ఇండ్ల అమ్మకాలు 2,72,710 యూనిట్లకు చేరాయి. అంటే ఇండ్ల అమ్మకాలు  2019 (కొవిడ్​కు ముందు) లోని 2,61,360 యూనిట్ల సంఖ్యను ఇప్పటికే మించిపోయాయి. హోమ్​ లోన్లపై వడ్డీ రేట్లు కొంత పెరుగుతున్నా పండగల సీజన్​లోనూ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతోందని ఎనరాక్​ ఈ రిపోర్టులో  పేర్కొంది. ఈ నేపథ్యంలో 2022 కేలండర్​ సంవత్సరంలో ఇండ్ల అమ్మకాలు రికార్డు లెవెల్​లో 3.6 లక్షల యూనిట్లకు చేరడం ఖాయమనిపిస్తోందని తెలిపింది.  హౌసింగ్​లోన్లపై వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగాయని వివరించింది. 

2020 లో కొవిడ్​ కారణంగా దేశవ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు 1,38,340 యూనిట్లకు పడిపోయాయి. ఆ తర్వాత ఏడాది అంటే 2021 లో డిమాండ్​ కొంత పుంజుకోవడంతో అమ్మకాలు మళ్లీ 2,36,520 యూనిట్లకు పెరిగినట్లు ఎనరాక్​ రిపోర్టు వెల్లడించింది. అయితే కొవిడ్​ ముందు లెవెల్స్​కు మాత్రం ఈ సేల్స్​ చేరలేదు. దేశంలో హౌసింగ్​ డిమాండ్​ రాబోయే కొన్నేళ్లలో పటిష్టంగా ఉండబోతోందని ఇటీవలే హెచ్​డీఎఫ్​సీ క్యాపిటల్​ ఎండీ విపుల్​ రుంగ్టా కూడా చెప్పారు. డెమొగ్రఫిక్స్​ ఇందుకు ఒక కారణమని  అన్నారు. హోమ్​లోన్లపై ఆధారపడటం  కొంత తగ్గుతోందని పేర్కొన్నారు. 

పెద్ద డెవలపర్ల వైపే కస్టమర్ల చూపు...

పెద్ద బిల్డర్లు, లిస్టెడ్​ డెవలపర్ల ప్రాజెక్టులపైనే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కూడా ఈ రిపోర్టులో ఎనరాక్​ తెలిపింది. 2022లో కొత్త ప్రాజెక్టుల  లాంఛ్​ మాత్రం 2014 తో పోలిస్తే తక్కువగానే ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది. 2014లో దేశంలోని ఏడు నగరాలలోనూ కలిపి 5,45,230 యూనిట్లతో ప్రాజెక్టులు లాంఛ్​ అయినట్లు పేర్కొంది. ట్రెండ్స్​ ప్రకారం చూస్తే  ఈ ఏడాది కొత్త లాంఛ్​లు 3.4 లక్షల యూనిట్లకు మించే అవకాశం లేదని వివరించింది. 2022లో ఇప్పటి దాకా అంటే 9 నెలల్లో మొత్తం 2,64,780 యూనిట్లతో ప్రాజెక్టులు లాంఛ్​చేసినట్లు తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో చూస్తే దేశంలోని పెద్ద డెవలపర్లందరి సేల్స్​ బుకింగ్స్​ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. యాన్యువల్​ సేల్స్​ బుకింగ్స్​లో ప్రెస్టీజ్​ ఎస్టేట్స్​, మాక్రోటెక్​ డెవలపర్స్​(గతంలో లోధా), గోద్రెజ్​ ప్రాపర్టీస్​, డీఎల్​ఎఫ్​ వంటివి ముందున్నాయని వివరించింది.  ఒబెరాయ్​ రియాల్టీ, శోభ, మహీంద్రా లైఫ్​స్పేస్​, ఇండియాబుల్స్​ రియల్​ ఎస్టేట్​, బ్రిగేడ్​ ఎంటర్​ప్రైజస్​, పూర్వాంకర లిమిటెడ్​, శ్రీరామ్​ ప్రాపర్టీస్​ వంటి కంపెనీలు పైన పేర్కొన్న పెద్ద డెవలపర్లకు గట్టి పోటీనే ఇస్తున్నట్లు కూడా ఎనరాక్​ వెల్లడించింది.

ఏడాది    ఇండ్ల అమ్మకాలు  

2013    3,18,400
2014    3,42,980
2015    3,08,250
2016    2,39,260
2017    2,11,140
2018    2,48,310
2019    2,61,360

ఇండియాలో రెసిడెన్షియల్​ మార్కెట్​ చరిత్ర సృష్టిం చబోతోంది.  గతంలోని అమ్మకాలను అధిగమిస్తుండటమే దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. పండగల సీజన్​లోనూ అద్భుతమైన డిమాండ్​ కనిపిస్తోంది. కొవిడ్​ తర్వాత సొంత ఇల్లు కావాలనే ఆలోచన బాగా అధికమైంది. గత కొన్ని నెలల్లో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) వడ్డీ రేట్లను 190 బేసిస్​ పాయింట్ల దాకా పెంచింది. మరోవైపు ప్రాపర్టీల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ, గతంలోలాగా ఈ ఏడాది ఫెస్టివల్​ సీజన్​ ఆఫర్లు, డిస్కౌంట్లు కనబడడం లేదు. ఇది  గమనించాలి. కిందటేడాది ఇండ్ల రేట్లు 10 %  దాకా పెరిగాయి. 

‑ అనూజ్​పూరి, ఎనరాక్​ గ్రూప్​ ఛైర్మన్​