డిస్ ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి

డిస్ ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి
  • ఎలెస్ట్​తో కుదిరిన ఒప్పందం
  • బెంగళూర్​లో కేటీఆర్​తో సంస్థ చైర్మన్ భేటీ 

హైదరాబాద్, వెలుగు: దేశ చరిత్రలో తొలిసారి డిస్ ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి దక్కింది. రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఎలెస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం బెంగళూర్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక్కటైన రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ అనుబంధ సంస్థ ఎలెస్ట్... అమోలెడ్ డిస్ ప్లేలు, లిథియం ఆయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ర్టిక్ వాహనాల వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. మంత్రి కేటీఆర్ తో రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ చైర్మన్ రాజేశ్ మెహతా సమావేశమై కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడితో రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్ ప్లేల తయారీ యూనిట్ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ, సెమీ కండక్టర్ సహా అనుబంధ రంగాల్లోనూ మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 6జీ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ వంటి డిస్ ప్లేలను తయారు చేయనున్నట్లు రాజేశ్ మెహతా చెప్పారు. 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తమ కంపెనీ ద్వారా దేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని అందిస్తామన్నారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎలెస్ట్ సీఈవో శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.