న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్

న్యాయవాదిపై దాడి చేసినవారిని శిక్షించాలి : మంత్రరాజం సురేశ్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం శివాజీ నగర్ కాలనీకు చెందిన వెంకట్ మహేంద్ర అనే న్యాయవాదిపై కొందరు యువకులు దాడి చేయడాన్ని ఖానాపూర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఖానాపూర్​లోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేష్​ అధ్యక్షుడు మంత్రరాజం సురేశ్ మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి హేయమైన చర్య అన్నారు. కేసుల్లో కక్షిదారుల తరఫున వాదిస్తున్నామన్న కోపంతో న్యాయవాదిపై భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల పరిరక్షణ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. వెంకట్ మహేంద్రపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దాడికి నిరసనగా సోమవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల సత్యనారాయణ, న్యాయవాదులు రాజ గంగన్న, కిషోర్ నాయక్, రాజశేఖర్, రాఘవేంద్ర, వినయ్, వేణుగోపాల్, రవి, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.