ఫస్ట్ మీటింగ్ లోనే ఫైటింగ్..రసాభాసగా ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్

ఫస్ట్ మీటింగ్ లోనే ఫైటింగ్..రసాభాసగా ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్
  •     రసాభాసగా ఆదిలాబాద్ మున్సిపల్ సర్వ సభ్య సమావేశం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఫైటింగ్ తోనే మొదలైంది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో 300 మంది కార్మికులను కొత్తగా నియమించుకుందామని పేర్కొన్నారు. దీనిపై ఇండిపెండెంట్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కార్మికులు అధికారులు, ఆఫీసులోనే ఎక్కువగా ఉంటున్నారని వీరిని ఇతర పనులకు తీసుకోవాలని సభ్యులు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనూష మాట్లాడుతూ.. ఏ పార్టీతో సంబంధం లేకుండా పనులు చేస్తామని పేర్కొన్నారు. 

స్లాటర్ హౌజ్ సమస్య పరిష్కరించాలని ఎంఐఎం కౌన్సిలర్లు కోరారు. ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లపోగా ఎజెండా అంశాలపై చర్చించారు. అనంతరం అనంతరం ఎజెండా పాస్ అంటూ చైర్ పర్సన్ అనూష బయటకు వెళ్లడంపై బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి సమస్యపై చర్చించాలని చైర్ పర్సన్ చాంబర్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు కౌన్సిలర్లు కాలర్లుపట్టుకొని తోసుకున్నారు. ఎమ్మెల్యే తనయుడు శరత్ కౌన్సిలర్లకు మద్దతు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి రెండు పార్టీల కౌన్సిలర్లు సముదాయించే ప్రయత్నం చేశారు. బందోబస్తు మధ్య కౌన్సిలర్లను ఆఫీస్ నుంచి బయటకు పంపించారు.