కూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ

కూటమి పార్టీలవన్నీ కుటుంబ రాజకీయాలే: ప్రధాని మోదీ

ఇటావా/అయోధ్య(యూపీ): ఇండియా కూటమిలోని పార్టీలంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటు బ్యాంకును  కాపాడుకునేందుకు ఆ పార్టీల నేతలు ఎంతటికైనా తెగిస్తారని విమర్శించారు. తమ కుటుంబాలు బాగుపడితే చాలనే మనస్తత్వం కాంగ్రెస్, సమాజ్​వాదీ పార్టీ నేతలది అని ఆరోపించారు. కుటుంబ రాజకీయాల కోసం రెండు పార్టీలు కలిసి పని చేస్తాయన్నారు. తాను మాత్రం దేశ భవిష్యత్తు, రాబోయే తరం గురించి ఆలోచిస్తానని చెప్పారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యూపీలోని ఇటావాలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. 

‘‘నాకు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు పిల్లల్లేరు. కానీ.. మేం ఎప్పటికీ మీ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంటాం. వచ్చే వెయ్యేండ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఇండియా ఉండేలా పునాదులు వేస్తున్నాం. మోదీ ఉన్నా.. లేకపోయినా.. దేశం ఎప్పటికీ అలాగే ఉంటది. కాంగ్రెస్, సమాజ్​వాది పార్టీ నేతలు ప్రజల కోసం ఏం చేశారు? వాళ్లంతా తమ భవిష్యత్తు, వారి పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. మీ కోసం ఎన్నికల్లో పోరాడటం లేదు.. వారి పిల్లల కోసం మాత్రమే పోరాడుతున్నరు’’అని విమర్శించారు. 

కూటమి నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే..

కాంగ్రెస్, సమాజ్​వాది నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే అని మోదీ అన్నారు. వారి ఆలోచనలన్నీ దేశాన్ని నాశనం చేసేలా ఉంటాయన్నారు. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే పని చేస్తారన్నారు. ‘‘కొందరు మెయిన్​పురి, కన్నౌజ్, ఇటావాను తమ రాజ్యాలుగా భావిస్తుంటారు. కొందరేమో అమేథీ, రాయ్​బరేలీని తమ సామ్రాజ్యం అనుకుంటారు. కానీ.. నేను సృష్టించిన సంపద దేశ వారసత్వం కోసమే ఉంటుంది. 2047లో మీ కొడుకు.. కూతురు.. కూడా ప్రధాని లేదా సీఎం కావాలని కోరుకునే వ్యక్తిని. రాజకుటుంబీకులు మాత్రం తమ వారసులనే ఎన్నికల బరిలో దించుతారు. వేరేవాళ్లకు చాన్స్ ఇవ్వరు. రాజకుటుంబీకులే ప్రధాని కాగలరన్న దుష్ట సంప్రదాయాన్ని ఈ ‘చాయ్​వాలా’ బ్రేక్ చేశాడు’’అని అన్నారు. దేశంలో ఒక ప్రధాని ఉండేవాడని.. ఆయన టీ అమ్మేవాడని, కుటుంబ రాజకీయాలను బ్రేక్ చేశాడని భవిష్యత్తులో చెప్పుకుంటారని అన్నారు. పేదోడి కొడుకు కూడా సీఎం, పీఎం కావచ్చు అన్నారు. దేశంలోని కోట్లాది మంది మహిళల కోసం మరుగుదొడ్లు కట్టి ఇచ్చామని, దళితులు, బీసీలకు విద్యుత్, గ్యాస్, ట్యాప్ కనెక్షన్ వంటి సౌలత్​లు కల్పించామని తెలిపారు. 

రామ్ లల్లాకు మోదీ పూజలు..

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లిన ప్రధాని మోదీ రాముడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల తర్వాత మోదీ అయోధ్యలో పర్యటించడం ఇదే తొలిసారి. పూజల అనంతరం మోదీ అయోధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఫైజాబాద్ లోక్ సభ అభ్యర్థి లల్లూ సింగ్ తరఫున ప్రచారం చేశారు. కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.