క్రిస్టియన్ ఓట్ల టార్గెట్‎గా.. పెరంబూర్ నుంచి పోటీ చేయనున్న విజయ్..!

క్రిస్టియన్ ఓట్ల టార్గెట్‎గా.. పెరంబూర్ నుంచి పోటీ చేయనున్న విజయ్..!

చెన్నై: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా సినీ నటుడు, టీవీకే చీఫ్​విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెన్నై జిల్లా నుంచి బరిలోకి దిగడం ఖాయమైనప్పటికీ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్‎గా మారింది. నార్త్ చెన్నై స్థానం నుంచి విజయ్ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ లేటేస్ట్‎గా మరో నియోజకవర్గం పేరు తెర పైకి వచ్చింది.

 చెన్నై జిల్లాలోని పెరంబూర్ నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీవీకే చీఫ్ ఈ నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తోంది. పెరంబూర్ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలమైన సభ్యత్వ బలంతో పాటు అధిక సంఖ్యలో క్రైస్తవ ఓటర్ల ఉండటంతో విజయ్ ఆ స్థానాన్ని ఎంచుకున్నారని టాక్. 

టీవీకే కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడే నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. టీవీకే కార్యకర్తలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రాథమిక సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. పెరంబూర్ నియోజకవర్గ పరిధిలోని కన్నదాసన్ నగర్ సమీపంలో ప్రచార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. విజయ్ పెరంబూర్ నుంచి బరిలోకి దిగితే మాత్రం ఈ నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారనుంది. 

చెన్నై జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో పెరుంబూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. పెరంబూర్ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్దది. ఇక్కడ సుమారు 2.21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 30 వేల మంది క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు. 10 వేల మందికి పైగా ముస్లిం ఓటర్లతో పాటు దళితులు, వన్నియార్లు, నాడార్లు, నాయుడులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 

క్రిస్టియన్ ఓటర్లు ఇక్కడ గెలుపును ప్రభావితం చేయగలరు. క్రిస్టియన్ ఓటర్లే లక్ష్యంగా విజయ్ ఈ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పెరంబూర్ ఎమ్మెల్యేగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు చెందిన ఆర్.డి. శేఖర్ ఉన్నారు. కాగా, ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. 2026, ఏప్రిల్ 23న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.