
ఎల్బీనగర్/ ఉప్పల్/ ముషీరాబాద్, వెలుగు: తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లకు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కర్మన్ ఘాట్ నుంచి సరూర్ నగర్ వరకు రోడ్ షోతో పాటు ఉప్పల్, సికింద్రాబాద్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు ముషీరాబాద్ రాంనగర్ లో ఆదివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్పితే ఇప్పటివరకు ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. పెంచిన పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకంలో తులం బంగారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతుబంధు ఆర్థికసాయం ఇంకా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. . తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూపాయి కూడా సహాయం చేయలేదన్నారు. గుడి పేరుతో ఓట్లు అడిగే బీజేపీని ఓడించాలని కేటీఆర్ అన్నారు.