సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ

సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల: విశాఖ, కాక ట్రస్ట్ ల పేరుతో పెద్దపల్లి పార్లమెంట్ లో అనేక సేవలు చేశామని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.   సింగరేణి రూ.450 కోట్ల నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క సింగరేణి బొగ్గు బావి కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మే 6వ తేదీ సోమవారం జిల్లాలో మందమర్రి కెకె 5 ఇంక్లైన్ లో సింగరేణి కార్మికులతో గడ్డం వంశీ కృష్ణ గేట్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. సింగరేణి సంస్థకు రావలసిన రూ.30 కోట్ల బకాయిలను చెల్లించాలన్నారు. ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతామని.. కార్మికుల సొంతింటి కల నెరవేర్చడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల యాక్సీడెంట్ ఇన్స్యూరెన్స్ కల్పించిది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కార్మిక కుటుంబాల కోసం  మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మినిమం వేజ్ బోర్డు ఏర్పాటు చేసింది కాక వెంకటస్వామి అని.. కాక స్ఫూర్తి తోనే పెద్దపల్లి పార్లమెంట్ లో ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని వంశీ చెప్పారు. సేవ చేసే నాయకులను..దోపిడీ చేసే నాయకులను ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రపంచంలోనే లేని సోలార్ రూఫ్ ప్రొడక్ట్ కనిపెట్టినందుకు అమెరికా ప్రభుత్వం తనకు అవార్డు కూడా ఇచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం  రూ.16 లక్షల కోట్ల సంపదనను అంబానీ, అదానీలకు దోచిపెట్టిందని విమర్శించారు. ప్రపంచంలోనే వారిని అత్యధిక ధనవంతులను చేసిందని ఫైరయ్యారు. తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే సింగరేణి సమస్యలు తీరుస్తానని గడ్డం వంశీ చెప్పారు.