ఫ్రిజ్ లు, వాషింగ్​ మెషీన్లు, మైక్రోవేవ్​ ఓవెన్లపై భారీ ఆఫర్లు

ఫ్రిజ్ లు, వాషింగ్​ మెషీన్లు, మైక్రోవేవ్​ ఓవెన్లపై భారీ ఆఫర్లు
  • పండగ సీజన్​ సేల్స్​ పెంచుకోవాలని కంపెనీల టార్గెట్​

వెలుగు, బిజినెస్​ డెస్క్​: పండగల సీజన్​ మొదలవనున్న నేపథ్యంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్​ మెషీన్లు, మైక్రో ఓవెన్ల అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. వారంటీ కాలం పెంపు, క్యాష్​ బాక్స్​, ఈజీ ఫైనాన్స్​ స్కీములతో కస్టమర్లను ఊరిస్తున్నాయి. వేసవిలో కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో పోగొట్టుకున్న సేల్స్​ను పండగ సీజన్​లో భర్తీ చేసుకోవాలని అప్లయన్సెస్​ కంపెనీలు చూస్తున్నాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్​ డే, ఆ తర్వాత కేరళలో పెద్ద ఫెస్టివల్​ ఓనం ఉండటంతో ఇప్పటి నుంచే సందడి మొదలెట్టాయి. ఓనంతోటే పండగల అమ్మకాలు మన దేశంలో బిగినవుతాయి. ఈ పండగ కోసం పది రోజుల పాటు ఫెస్టివల్​ ఆఫర్లను అందుబాటులో ఉంచాలని అప్లయన్సెస్​ కంపెనీలు  ప్లాన్లు వేస్తున్నాయి. 

సైనికుల కోసం ప్రత్యేక ఆఫర్లు....
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్​ మెషీన్లు, మైక్రో ఓవెన్లు సహా దేశంలో వైట్​గూడ్స్​ అమ్మకాలు ఏటా రూ. 65,000 కోట్ల దాకా ఉంటాయి. ఈ సేల్స్​ ప్రతీ సంవత్సరం 15 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఏటా జరిగే అమ్మకాలలో 55 నుంచి 60 శాతం అమ్మకాలు ఆగస్టు–డిసెంబర్​ మధ్యలోనే జరుగుతాయి. ఓనంతో మొదలై, ఆ తర్వాత దసరా, దీపావళి, క్రిస్టమస్​, న్యూ ఇయర్​, సంక్రాంతి పండగల దాకా అప్లయన్సెస్  అమ్మకాలు కొనసాగుతాయి. దేశానికి ఇండిపెండెన్స్​ వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కన్సూమర్​ డ్యూరబుల్స్​ బ్రాండ్లన్నీ ఈసారి సైనికుల కోసం ప్రత్యేక ఆఫర్లు తెస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్​ కంపెనీ శాంసంగ్​ ఈ దిశలో వారి కోసం ప్రత్యేక ఆఫర్​ తెచ్చింది. క్యాంటీన్​ స్టోర్స్​ డిపార్ట్​మెంట్​ (సీఎస్​డీ) రేట్లకే శాంసంగ్​ టీవీలు, ఎయిర్​ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్​ ఓవెన్లు, వాషింగ్​ మెషిన్లను ఎంపిక చేసిన శాంసంగ్​ స్మార్ట్​ ప్లాజా స్టోర్లలో పనిచేస్తున్న, రిటైరయిన సైనికులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ప్లాజా స్టోర్లలో కన్సూమర్​ ఎలక్ట్రానిక్స్​ ప్రొడక్టులన్నీ అందుబాటులో ఉంటాయి. పండగ సీజన్​ సందర్భంగా సైనికులు, మాజీ సైనికుల కోసం తమ స్టోర్లలో ప్రత్యేక బెనిఫిట్స్​ కల్పిస్తున్నట్లు శాంసంగ్​ తెలిపింది.

సౌత్​ ఇండియా వాటా 25 శాతం..
ఏసీ, అప్లయన్సెస్​ అమ్మకాలలో 25 శాతం సౌత్​ ఇండియా నుంచే వస్తాయి. ఈ రాష్ట్రాల్లో సేల్స్ వేగంగా పెరుగుతున్నాయి.  సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో పోగొట్టుకున్న అమ్మకాలను ఈ సారి పండగ సీజన్​లో రాబట్టుకోవడానికి కంపెనీలు ఆఫర్లను గుమ్మరిస్తున్నాయి.  

2020లో పండగ సేల్స్​ లేవు..
కిందటేడాది పండగల సీజన్​లో కరోనా ఎఫెక్ట్​ వల్ల అమ్మకాలు జోరుగా సాగలేదు. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ల ద్వారా అప్లయన్సెస్​ సేల్స్​ తగ్గకున్నా, ఆఫ్​లైన్​ అంటే స్టోర్ల ద్వారా సేల్స్​ బాగా పడిపోయాయి. ఈ పండగల సీజన్​లోనైనా అమ్మకాలు భారీగా జరగాలని అప్లయన్సెస్​ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇండస్ట్రీ రెవెన్యూలో 70 శాతం ఆఫ్​లైన్​ అమ్మకాల ద్వారానే ఇప్పటికీ వస్తోంది. బాష్​, సీమెన్స్​, గాజ్​నావ్​ బ్రాండ్లను అమ్మే బీఎస్​హెచ్​ హోమ్​ అప్లయన్సెస్​ కూడా ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 8–22 మధ్యలో సేల్స్​పై సూపర్​ క్యాష్​ బ్యాక్​ అందించనున్నట్లు తెలిపింది. రూ. 999 కే మూడేళ్ల అదనపు వారంటీ కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్​ మాత్రం నవంబర్ 30 దాకా ఉంటుందని వివరించింది. ఈఎంఐ ఆప్షన్లూ ఉంటాయని పేర్కొంది. స్మాల్​ అప్లయన్సెస్​కు ఎక్స్చేంజ్​ ఆఫరూ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.