కాళ్లు, చేతులు తెగిపోయినా మళ్లీ పెరిగే ఛాన్స్!

కాళ్లు, చేతులు తెగిపోయినా మళ్లీ పెరిగే ఛాన్స్!

బల్లులు, సాలమాండర్​ల వంటి కొన్ని జంతువులకు తోకలు, కాళ్లు తెగిపోయినా.. మళ్లీ పెరుగుతాయి! తెగిపోయిన వాటి స్థానంలో కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి అవయవాలు ఏర్పడతాయి. వాటిలాగా మనకు కూడా కాళ్లు, చేతులు తెగిపోయినా.. మళ్లీ పెరిగితే మస్త్ ఉంటది కదా! అయితే, భవిష్యత్తులో ఇది సాధ్యం అయ్యే చాన్స్ కూడా ఉందంటున్నారు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ సైంటిస్టులు. సాలమాండర్, బల్లుల్లో తెగిన అవయవాలు మళ్లీ ఎలా పెరుగుతున్నాయన్న విషయంపై కొత్త కోణంలో రీసెర్చ్ చేసిన తాము మనుషుల్లోనూ ‘సాలమాండర్ పవర్‌‌’ ఉందని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ఎముకల కీళ్ల వద్ద కార్టిలేజ్ అరిగిపోతే, తిరిగి పెరిగేలా చేసేందుకు మాత్రమే వీలవుతుందని, భవిష్యత్తులో కాళ్లు, చేతుల వంటి అవయవాలను పూర్తిస్థాయిలో తిరిగి పెరిగేలా చేసేందుకు సాధ్యం కావచ్చని వారు తెలిపారు.

కిటుకు ఇలా తెలిసింది..

మడమలు, మోకాళ్లు, తుంటి ఎముకల కీళ్ల వద్దే ఎక్కువగా కార్టిలేజ్ అరిగిపోయి ఆస్టియో ఆర్థ్రైటిస్ వస్తుంటుంది. వీటిలో తుంటి వద్ద కార్టిలేజ్ రిపేర్ కావడం చాలా కష్టం. కానీ మడమల దగ్గర ఈజీగా రిపేర్ అయిపోతుందట. దీనికి కారణమేంటని రీసెర్చ్ చేయగా, మడమల వద్ద కార్టిలేజ్‌‌లో కొలాజెన్‌‌ అనే దారపు పోగుల వంటి టిష్యూలో ప్రొటీన్లు చాలా యంగ్‌‌గా ఉంటున్నాయట. మోకాలు, తుంటి వద్ద ఓల్డ్ ప్రొటీన్లు ఉంటున్నాయట. సాలమాండర్‌‌లలో కూడా సేమ్ ఇలాగే ఉంటుందట. అందుకే.. ఈ ప్రొటీన్లు ఎలా ఉత్పత్తి అవుతున్నాయని పరిశీలించగా, వాటిలో మైక్రోఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కారణమని తేలింది. మనలోనూ ఈ మాలిక్యూల్స్ ఉన్నాయని, వీటిని ప్రేరేపించడం ద్వారా కార్టిలేజ్ పెరిగేలా చేయొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.