బంజారాహిల్స్, వెలుగు: సిటీలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 28 వరకు 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను నిర్వహించనున్నామని బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ జూలూరి గౌరీశంకర్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలకు కూడా బుక్ ఫెయిర్‌ను తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం పుస్తక పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం జ్ఞాన కలయికకు నిదర్శనమన్నారు. యక్ష గానానికి పేరుగాంచిన దళిత మహిళ చిందు ఎల్లమ్మ పేరును ఈ ఏడాది హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌కు పెడుతున్నామని చెప్పారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణు మాధవ్ గుర్తుగా ఓ ప్రాంగణానికి ఆయన పేరును పెడుతున్నట్లు తెలిపారు. కరోనా రూల్స్ పాటిస్తూ బుక్ ఫెయిర్ ఉంటుందన్నారు. బుక్ ఫెయిర్‌కు చీఫ్ గెస్టులుగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
