సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న జనం

సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న జనం
  • ఉస్మానియా, గాంధీల్లో రోజుకు వేయి దాటుతున్న  ఓపీ 
  • ఏరియా ఆస్పత్రుల్లోనూ భారీగా పెరిగిన రద్దీ
  • ఫీవర్ హాస్పిటల్​కు రోజుకు 500 మంది 
  • ఉస్మానియాలో రివ్యూ పేషెంట్లకు స్పెషల్ ఓపీ

హైదరాబాద్, వెలుగు: సీజనల్​ వ్యాధులతో సిటీ జనం భయపడిపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్​వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బస్తీ ప్రజలు అల్లాడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు,  కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఫీవర్​ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ, ఏరియా ఆస్పత్రులకు  సీజనల్​వ్యాధుల లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం ఓపీలో సగం మంది  సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

వాతావరణంలో మార్పులు..

గత 10 రోజులుగా వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలతో సర్కార్​ హాస్పిటళ్లకు వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. గాంధీ ఓపీకి వారం రోజులుగా 2500 మందికి పైగా పేషెంట్లు వచ్చారు. ఉస్మానియాకు డైలీ 600 మంది వస్తుండగా.. వీరిలో 30 శాతం మంది వైరల్​ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి కూడా 500 మంది వరకు వస్తున్నారు. నిలోఫర్​తోపాటు ఏరియా ఆస్పత్రులకు రోజుకు వెయ్యి మంది వరకు పేషెంట్లు వస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు సాధారణ రోజులతో పోలిస్తే వర్షాలు పడిన తర్వాత 30 శాతం మంది ఓపీ పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఆస్పత్రుల్లో క్యూ లైన్ల వద్ద నిబడిన వారిలో ఎవరిని కదిలించినా సీజనల్ వ్యాధులతోనే వస్తున్నట్లు చెబుతున్నారు.  

స్టార్ట్​ అవుతున్న డెంగీ కేసులు

గ్రేటర్​లో గత మూడేళ్లుగా మలేరియా కేసులు పెద్దగా నమోదు కానప్పటికీ.. డెంగీ కేసులు మాత్రం ఏటా వస్తున్నాయి. 2021లో నాలుగు వేల డెంగీ కేసులు నమోదు కాగా, 2022లోనూ నాలుగు వేలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 400 కేసులు బయటపడ్డాయి. వీటిల్లో గత నెల జూన్​లోనే 120 నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 65 కేసులు వెలుగుచూశాయి. వర్షాల నేపథ్యంలో ఈ నెలతో పాటు వచ్చే రెండు నెలల్లోనూ భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ కేసులు తగ్గే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు.

సెపరేట్ ఓపీ ఏర్పాటు చేయాలె

ఉస్మానియాకు గత కొంత కాలంగా ఓపీ రెండు వేలు దాటుతోంది. వీరిలో ఇదివరకు డాక్టర్లను సంప్రదించి మరోసారి చూపించేందుకు వచ్చిన రివ్యూ కేసులే 20 శాతం వరకు ఉంటున్నాయి.  కొత్తగా ఓపీకి వచ్చేవారి వివరాలను నమోదు చేసి, డాక్టర్లను సంప్రదించేవరకు గంటల టైం పడుతుంది. దీంతో ఈ రివ్యూ పేషెంట్లు సైతం క్యూ లైన్​లో గంటల కొద్దీ వెయిట్​ చేయాల్సి వచ్చేది. ఈ విషయాన్ని గుర్తించి వైద్యాధికారులు.. డాక్టర్​కు అన్ని వివరాలు తెలిసిన రివ్యూ పేషెంట్ల కోసం సపరేట్ ఓపీ ఏర్పాటు చేశారు. దీంతో వారు క్షణాల్లో ఓపీలో డాక్టర్లను కలిసి వెళుతున్నారు. ఇలా అన్ని హాస్పిటళ్లలోనూ రివ్యూ ఓపీలు ఏర్పాటు చేయాలని పేషెంట్లు డిమాండ్​చేస్తున్నారు.

జాగ్రత్తగా ఉండాలి

గాంధీలో ఇటీవల ఔట్ ​పేషెంట్ల రద్దీ పెరిగింది. వానాకాలం రావడంతో సీజనల్​వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో డాక్టర్లు పూర్తిస్థాయిలో ఉన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 6 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి.  సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల, బయట కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి నిల్వ కారణంగా డెంగీ వ్యాధికారక దోమలు పెరిగే ప్రమాదం ఉంది. 
– డాక్టర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్