- ఉప్పల్ మీదుగా వచ్చే వాహనాలు భగాయత్ వైపు మళ్లింపు
- భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లేలా ఏర్పాటు
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించాలని పోలీసుల సూచన
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే ఉప్పల్ రింగ్ రోడ్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతుండటంతో మ్యాచ్ రోజున మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత వాహనాల బదులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్ రూట్లు..
ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వెహికల్స్‌ను మెహిఫిల్ హోటల్ పక్కనుంచి ఉప్పల్ భగాయత్ (హెచ్‌ఎండీఏ లేఅవుట్) వైపు మళ్లిస్తారు. ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్, ఘట్‌కేసర్, తార్నాక వైపు వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా ప్రయాణించాలి. తార్నాక వెళ్లేవారు చెంగిచర్ల–ఐవోసీఎల్–చర్లపల్లి మార్గంలో వెళ్లాలి. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు హబ్సిగూడ ఎక్స్ రోడ్, నాచారం, ఎన్‌ఎఫ్‌సీ రోటరీ, ఐవోసీఎల్, చెంగిచర్ల, మేడిపల్లి మార్గంలో ప్రయాణించాలి.
వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే హెవీ వెహికల్స్ ఘట్‌కేసర్ వద్ద ఓఆర్‌ఆర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మార్గంలో వెళ్లాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు ఎల్‌బీనగర్, హయాత్‌నగర్, అబ్దుల్లాపూర్ మీదుగా ఓఆర్‌ఆర్ చేరుకుని ఘట్‌కేసర్‌కు వెళ్లాలి. మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఐదు ప్రాంతాల్లో పార్కింగ్..
మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకుల వాహనాల కోసం ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీ, పాస్ హోల్డర్లకు స్టేడియం లోపలే పార్కింగ్ కల్పించారు. ఎల్‌బీనగర్–రామంతాపూర్ వైపు నుంచి వచ్చే ప్రేక్షకులకు డీఎస్‌ఎల్ ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ, ఎల్‌జీ గోడౌన్ జంక్షన్ నుంచి కేమ్‌వేదా జంక్షన్ వరకు పార్కింగ్ కేటాయించారు. తార్నాక–హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వారికి సర్వే ఆఫ్ ఇండియా వద్ద యూటర్న్ తీసుకుని ఏక్ మినార్, పెంగ్విన్, టీజీ ఐలా వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను వినియోగించాలని పోలీసులు తెలిపారు.
