జవాన్ల కోసం మళ్లీ ఆర్మీ ట్రక్ నడుపుతా: అన్నా హజారే

జవాన్ల కోసం మళ్లీ ఆర్మీ ట్రక్ నడుపుతా: అన్నా హజారే

ముంబై: పుల్వామా దాడితో ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోంది. చాన్సిస్తే తుపాకీ పట్టి యుద్ధ రంగంలోకి దూకాలన్న కసితో ఉంది దేశమంతా. బడికెళ్లే కుర్రాడి నుంచి నిండు జీవితాన్ని చూసిన వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ముష్కరులను మట్టుబెట్టాలంటూ బరువెక్కిన గుండెతో అమర జవాన్లకు సలాం చేస్తున్నారు.

ఇదే ఆవేశంతో ఉన్న సామాజికవేత్త అన్నా హజారే 81ఏళ్ల వయసులోనూ మళ్లీ ఆర్మీలోకి వచ్చేందుకు రెడీ అని ప్రకటించారు. లోక్ పాల్ కోసం ఆరు రోజుల దీక్ష చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలిపారు. శుత్రవుపై పోరాడేందుకు వీర సైనికులకు సాయం చేసేందుకు తనకు కావాల్సినంత శక్తి ఉందని అన్నారాయన.

‘‘ఈ వయసులో నేను గన్ పట్టుకోలేను కానీ, స్టీరింగ్ పట్టే సత్తా ఉంది. దేశం కోసం పోరాడుతున్న జవాన్లకు అవసరమైన ఆయుధ సామగ్రి సరఫరా చేసేందుకు మిటలరీ ట్రక్కు నడుపుతా’’ అని ఆస్పత్రి బెడ్డుపై ఉన్న హజారే చెప్పారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు.

ప్రస్తుతం సామాజికవేత్తగా పేరొందిన అన్నా.. గతంలో ఆర్మీలో పని చేశారు. 1960లో మిలటరీలో చేరారు. 1965లో పాక్ పై జరిగిన యుద్ధంలో ఖేమ్ కరణ్ సెక్టార్ లో ఆర్మీ డ్రైవర్ గా సేవలందించారు.