పాక్‌ని వణికించిన ఫైటర్ ప్లేన్‌కి వాటర్ సెల్యూట్.. సూపర్ విజువల్స్

పాక్‌ని వణికించిన ఫైటర్ ప్లేన్‌కి వాటర్ సెల్యూట్.. సూపర్ విజువల్స్

దాదాపు మూడు దశాబ్దాలు పైగా భారత్‌కు సేవలందించిన తురుపు ముక్క.. మిగ్ – 27 యుద్ధ విమానం. శాంతి స్థాపనలో… యుద్ధాల్లో అనితర సాధ్యమైన శక్తి సామర్థ్యాలతో శత్రువుకు వణుకు పుట్టించిన ఫైటర్ జెట్ ఇది. శుక్రవారం దీని లాస్ట్ వర్కింగ్ డే. 1985లో భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరిన ఈ యుద్ధ విమానం నేటితో సేవలు విరమిస్తోంది.

కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సేనల్ని తరిమికొట్టిన ఈ యుద్ధ విమానానికి భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్ బేస్‌లో చివరిసారిగా మిగ్ – 27 ఆకాశంలో విహరించింది. ఆ తర్వాత వాటర్ సెల్యూట్‌తో దాని సేవలను గౌరవిస్తూ థ్యాంక్స్ చెప్పింది వాయుసేన.

మిగ్ యుద్ధ విమానాలు తొలిసారి భారత వాయుసేలో 1958లో చేరాయి. వీటిని రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత ప్రభుత్వం. మిగ్ – 21 టైప్ 77, మిగ్ – 21 టైప్ 96, మిగ్ – 23 బీఎన్, మిగ్ – 23 ఎంఎఫ్, మిగ్ – 27 ఎంఎల్, మిగ్ – 27 అప్‌గ్రేడ్స్… ఇలా మిగ్ యుద్ధ విమానాల శ్రేణి భారత వాయుసేనకు సేవలు అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్‌లో మిగిలింది 1985లో వచ్చిన మిగ్ -27 మాత్రమే. ఇందులోని ఏడు యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లో ఉన్న చిట్టచివరి మిగ్ -27 అప్‌గ్రేడ్స్ నేడు డీకమిషన్ అయ్యాయి.

కార్గిల్.. పరాక్రమ్
మిగ్ – 27 వాయుసేనలో చేరిన నాటి నుంచి పలు ముఖ్యమైన ఆపరేషన్, నేషనల్, ఇంటర్నేషనల్ ఫీట్స్‌లో పాల్గొంది. ముఖ్యంగా కార్గిల్ వార్‌లో పాక్ మిలటరీని వణికించి.. తోక ముడిచి పరారయ్యేలా చేసింది. ఆకాశంలో ఫ్లీట్ చేస్తూ పాక్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఆ యుద్ధంలో భారత్‌కు విజయం వరించడంలో మిగ్ కీలక పాత్ర పోషించింది.

అలాగే భారత పార్లమెంటుపై పాక్ ముష్కరుల దాడి తర్వాత 2001 డిసెంబరులో మన ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్‌లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసింది మిగ్ – 27. దాదాపు ఆరు నెలల పాటు సరిహద్దుల్లో సాగిన మిలటరీ స్టాండ్‌ఆఫ్‌లో అన్ని ఆయుధాలతో సర్వసన్నద్ధంగా నిలిచింది.