మెల్‌బోర్న్: నాలుగు రోజుల టెస్ట్‌లను తప్పనిసరి చేసే యోచనలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఉన్నట్లు తెలుస్తోంది. ట్రెడిషనల్ ఐదు రోజుల టెస్ట్‌లను కుదించడం ద్వారా లభించే సమయంతో మరిన్ని టోర్నీలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా 2023 నుంచి ఐదు రోజుల ఆటకు గుడ్‌బై చెప్పి.. ఫోర్ డే మ్యాచ్‌లు నిర్వహించాలన్నది ఐసీసీ క్రికెట్ కమిటీ ప్లాన్. మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించి, బైలేటరల్ సిరీస్‌లు పెంచాలన్న బీసీసీఐ డిమాండ్‌ను నెరవేర్చాలంటే ఐదు రోజుల టెస్ట్‌లను కుదించడమే మార్గమని ఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ 2015–2023 మధ్యే ఈ నాలుగు రోజుల కాన్సెప్ట్‌ను అమలు చేస్తే క్రికెట్ షెడ్యూల్‌లో 335 రోజులు ఫ్రీ అయ్యేవి. అయితే ఐసీసీ ప్రతిపాదనపై సభ్యదేశాలు, స్టేక్‌హోల్డర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు రోజుల కాన్సెప్ట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్, టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయం భావోద్వేగంగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఐదు రోజుల టెస్ట్‌లతో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా కష్టపడాల్సి వస్తుందని పైన్ చెప్పుకొచ్చాడు. కానీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ ప్రతిపాదనపై మాట్లాడడానికి నిరాకరించాడు. ఇప్పుడే స్పందిస్తే తొందరపాటు అవుతుందన్నాడు. ఇది ప్రతిపాదన మాత్రమే అని, కార్యరూపం దాల్చే సమయానికి తమ అభిప్రాయం వెల్లడిస్తామన్నాడు. కాగా, ఫోర్ డే టెస్ట్ కాన్సెప్ట్ కొత్తదేం కాదు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్–ఐర్లాండ్, 2017లో సౌతాఫ్రికా–జింబాబ్వేల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌లు ప్రయోగాత్మకంగా నిర్వహించారు.

