డ్రైవర్ పై కేసు ఉంటే క్యాబ్ బ్లాక్

డ్రైవర్ పై కేసు ఉంటే క్యాబ్ బ్లాక్

ఉబెర్, ఓలా సంస్థలు డ్రైవర్లపై కేసులు ఉంటే కొరడా ఝుళిపిస్తున్నాయి. తమ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి ట్రాక్ రికార్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. డ్రైవర్లపై చిన్న కేసు నమోదైనట్లు తేలినా పక్కన పెట్టేస్తున్నాయి. గత మూడు నెలల కాలంలో దాదాపు 2 నుంచి 3 వేల మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాయి. వీరికి పూర్తిగా బిజినెస్ ఇవ్వడాన్ని నిలిపివేశాయి. క్యాబ్ డ్రైవర్ల ట్రాక్ రికార్డు లో ఎలాంటి రిమార్క్స్ ఉండకూడదని సంస్థలు భావిస్తున్నాయి. గతంలో ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాల్లో ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక డ్రైవర్ల ట్రాక్ రికార్డుపై పూర్తి స్థాయి నిఘా పెట్టాలని నిర్ణయించాయి. నిజానికి ఉబెర్, ఓలా లో డ్రైవర్లకు బిజినెస్ ఇచ్చే ముందే  వారి గురించి పూర్తి వివరాలను సేకరించాకే వారికి బిజినెస్ ఇవ్వాలి. కానీ ఇన్నాళ్లు ఆయా సంస్థలు ఈ నిబంధనలు ఏమీ పాటించకుండానే బిజినెస్ ఇచ్చాయి. ఇప్పుడు డ్రైవర్ల ట్రాక్ రికార్డు పేరుతో ప్రత్యేకంగా వారి సమాచారాన్ని సేకరిస్తూ చాలా మందిని బ్లాక్ చేస్తున్నాయి.

ఉబెర్, ఓలా వైఖరిపై డ్రైవర్ల ఆందోళన
ఇన్నాళ్లు లేని నిబంధనను ఒక్కసారిగా తీసుకొచ్చి ఇష్టానుసారంగా డ్రైవర్లను బ్లాక్ చేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నేరాలు, క్రిమినల్ కేసులు వంటివి ఉన్న వారిని బ్లాక్ లిస్ట్ లో పెడితే తమకు అభ్యంతరం లేదు. కానీ పిటి కేసు, ఆందోళనల్లో పాల్గొనటం, ఏదైనా పార్టీల్లో తిరగటం, యూనియన్ లో పనిచేయటం లాంటివి చేసే వారిని సైతం బ్లాక్ లిస్ట్ లో పెట్టే కార్యక్రమం ప్రారంభించారని చెబుతున్నారు. కస్టమర్ల రివ్యూల ఆధారంగానూ బ్లాక్ లిస్ట్ చేర్చటం అన్యాయమంటున్నారు. కస్టమర్లు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి చాలా కారణాలుంటున్నాయని బుకింగ్ ఆలస్యమైనా…రోడ్లు బాగాలేకపోయిన కంపెనీ రూల్స్ కచ్చితంగా చెప్పినా కొంత మంది కస్టమర్లు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి మందలింపో, మరో విధమైన చర్యనో తీసువాలని గానీ ఇలా పొట్టపై కొట్టడం సరికాదని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి పోతే బతికేదెలా..

పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా చేరిన చాలా మంది ఇప్పుడు ఉబెర్, ఓలా పైన ఆధారపడ్డారు. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష మంది వరకు డ్రైవర్లు ఓలా, ఉబెర్ కార్లను నడుపుతున్నారు. కొంతమంది ఓలా నుంచి లీజు వాహనాలను నడుపుతున్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ లాంటి పథకాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాయితీల్లో కార్లను అందజేశారు. ఇలాంటి వారిలో చాలా మందికి ఉపాధి కల్పిస్తామని ఉబెర్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. దీంతో వేల సంఖ్యలో డ్రైవర్లు ఉబెర్ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరికి డ్రైవింగ్ తప్ప మరో జీవనాధారం లేదు. అలాంటిదీ హఠాత్తుగా బ్లాక్ లిస్ట్ లో పెడితే తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓలా, ఉబెర్ లాంటి సంస్థలు వచ్చిన తర్వాత ఆయా సంస్థలను కాదని ట్యాక్సీ నడిపించుకునే వారికి అస్సలు గిరాకీయే ఉండటం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్ లో చేరిన డ్రైవర్లు చేతిలో పనిలేక కుటుంబాన్ని పోషించటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లీజ్ డ్రైవర్లదీ దయనీయ పరిస్థితి

లీజు డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓలా సంస్థ ఇచ్చే కార్లను లీజు తీసుకొని వీరు జీవనాధారం పొందుతున్నారు. ఇందుకోసం ముందుగా రూ.35 వేలు అడ్వాన్స్ చెల్లించి…ఆ తర్వాత రోజుకు రూ.1135 కిరాయి కంపెనీకి చెల్లిస్తారు. ఇలాంటి వారికి 2 నుంచి 3 ఏళ్ల తర్వాత అదే కారును సెకండ్ హ్యాండ్ కారు ధరల్లో మరో 50 శాతం తగ్గించి మరీ ఓలా సంస్థ వారికే కారును విక్రయిస్తుంది. మూడేళ్లు ఇలా ఓలాలో కారు నడిపితే సొంతంగా తక్కువ ధరకు కారు కొనుక్కోవచ్చని చాలా మంది ఓలాలో కారు నడుపుతున్నారు. ఇలాంటి వారికి బ్లాక్ లిస్ట్ లో చేరిస్తే తాము అసలు కారు కొనే పరిస్థితి లేకపోగా ముందుగా కట్టిన 35 వేల రూపాయలు కూడా కోల్పోతున్నామని చెబుతున్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

క్రిమినల్ కేసులు ఉన్నవారిని కచ్చితంగా బ్లా క్ చేయాలి. కానీ కొంత మంది డ్రైవర్లపై కేసులు లేకున్నా మీరు ఆ పార్టీ ఈ సంఘంలో పనిచేస్తున్నా రంటూ బ్లా క్ లిస్ట్ లో పెడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చాలనే ఉద్దేశంతో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం పెట్టడంతో చాలా మంది ఉబెర్ లో
డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఇలా చిన్న కారణాలకే డ్రైవర్లను పక్కన పెడితే బతికేదేలా ? ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. డ్రైవర్లను బ్లా క్ చేయాలంటే ప్రభుత్వమే రూల్స్ రూపొందించాలి.

సలావుద్దీన్,
ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు

తప్పుడు కేసులు పెడితే ఎలా?

నాపై హిట్ కేసు ఉందని బ్లాక్ చేశారు. నిజానికి నాపై ఎలాంటి కేసు లేదు. అయిన పోలీస్ కేసు ఉందంటూ బ్లాక్ చేయడంతో జీవనాధారం కోల్పోయాను. నిజంగా నాపై కేసులు ఉంటే బ్లాక్ చేయాలి. కానీ తప్పుడు సమాచారంతో ఇలా చేస్తే నేను బతికేదెలా ? దయచేసి నన్ను ఆదుకోండి.

షఫీ ఖాన్, బాధిత డ్రైవర్