స్టింగ్ ఆపరేషన్​ నిజమైతే.. అరెస్ట్​ చేయండి

స్టింగ్ ఆపరేషన్​ నిజమైతే.. అరెస్ట్​ చేయండి
  • ఢిల్లీ లిక్కర్​ పాలసీపై స్టింగ్ ఆపరేషన్ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
  • ఢిల్లీ, హైదరాబాద్​లో భేటీలపై మా వద్ద ఆధారాలున్నయ్
  • వాటిని కోర్టు ముందు ఉంచుతామని ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం లైసెన్సుల కాంట్రాక్టులను అప్పగించడంలో ఆప్ సర్కారు అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ స్కాంకు సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన భేటీలపై కోర్టులో తేల్చుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. ఆయా నేతల పేర్లు ప్రస్తావించవద్దని కోర్టు స్టే విధించిందని, అందువల్ల ఆయా అంశాలపై ప్రస్తావించలేమని పేర్కొంది. ‘లిక్కర్​ స్కాంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ, హైదరాబాద్​లో ఎవరెవరిని కలిశారు’ అనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం ఢిల్లీలో జరిగిన మీడియాతో బీజేపీ ఢిల్లీ చీఫ్​ ఆదేశ్​ గుప్తా , పార్టీ నేతలు సుధాన్షు త్రివేది, మంజిందర్​ సిర్సా స్టింగ్​ ఆపరేషన్ ​వీడియోను విడుదల​ చేశారు. లిక్కర్ హోల్ సేలర్, స్కాంలో తొమ్మిదో నిందితుడిగా ఉన్న అమిత్ అరోడా డబ్బులు చేతులు మారిన తీరును ఈ వీడియోలో వివరించాడు. ఢిల్లీలోని ఒబెరాయ్, లోధి హోటల్స్ లో లిక్కర్ పాలసీ తయారైనట్లు వెల్లడించాడు. ‘అరుణ్ పిళ్లై, జస్ దీప కౌరు చెడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ ఇంకా కొంత మంది కలిసి ఈ పాలసీ తయారు చేశారు. ఎల్ వన్ షాపులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్లాక్ మనీని, వైట్ మనీ చేసుకునేందుకు కొంత మంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీ ఖజానాకు ఈ దందాతో వేల కోట్ల నష్టం జరిగింది. గుజరాత్​కు అక్రమ మద్యం, పంజాబ్​లో అమ్ముతోన్న లిక్కర్ ఢిల్లీ నుంచి సరఫరా అవుతుంది’ అని ఆ వీడియోలో అమిత్ చెప్పాడు.

పెద్దోళ్లను మాత్రమే బతికిస్తున్నరు

లిక్కర్​ సిండికేట్లు ఆప్​కు రూ.100 కోట్లను క్యాష్​ రూపంలో ఇచ్చారని, ఈ డబ్బును గోవా లేదా పంజాబ్​ ఎన్నికల్లో ఉపయోగించారని బీజేపీ ఆరోపించింది. ఆప్​ పాలసీ చిన్న రిటైలర్లను చంపేస్తోందని, పెద్దోళ్లకు భరోసా ఇస్తోందని ఈ ఆపరేషన్​లో వెల్లడైందని పేర్కొంది. గతంలో లిక్కర్​ లైసెన్స్​ రూ.10 లక్షలు ఉండేదని, కానీ ఇప్పుడు దాన్ని రూ.5 కోట్లకు పెంచారని, దీంతో చిన్న వ్యాపారులు దూరమయ్యారని చెప్పింది. ఆప్​ సర్కారు రిటైలర్స్ ​నుంచి కాకుండా హోల్​సేలర్స్​ నుంచి మాత్రమే డబ్బులు తీసుకోవాలనుకుందని, అందుకే హోల్​సేలర్ల కోటాకు ఎలాంటి పరిమితులు పెట్టలేదని విమర్శించింది. గతంలో హోల్​సేలర్లు లేదా సప్లయర్లకు కమీషన్​ 5% ఉంటే.. ఇప్పుడు దానిని 12 శాతానికి పెంచారని, పంజాబ్​లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారని, కానీ అక్కడ 12% కాకుండా 10% అమలు చేస్తున్నారని చెప్పింది. 2021–22 ఢిల్లీ ఎక్సైజ్​ పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు పెట్టింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా సహా 15 మంది పేర్లను చేర్చింది. అవినీతి అంతం పేరుతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. సీఎం సీట్లో కూర్చునేందుకు కేజ్రీవాల్ అనర్హుడని, ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 

స్టింగ్ ఆపరేషన్​ నిజమైతే.. అరెస్ట్​ చేయండి: మనీశ్ ​సిసోడియా

బీజేపీ విడుదల చేసిన స్టింగ్​ ఆపరేషన్​లో ఏమైనా నిజం ఉంటే.. 4 రోజుల్లో తనను సీబీఐతో అరెస్ట్​ చేయించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ ​సిసోడియా సవాల్​ విసిరారు. సీబీఐకి ఆ స్టింగ్​ ఆపరేషన్​ వీడియోను అందించాలని, అందులో నిజం ఉంటే సోమవారాని కల్లా తనను అరెస్ట్​ చేయాలని, లేకపోతే ఈ స్టింగ్​ ఆపరేషన్​ మరో అబద్ధమని ఒప్పుకోవాలని డిమాండ్​ చేశారు. అరవింద్ ​కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆప్​ సర్కారును పడగొట్టేందుకు బీజేపీ, ప్రధాని మోడీ చేస్తున్న కుట్రలో ఇదంతా భాగమని ఆరోపించారు. తనను సీబీఐ అరెస్ట్ చేయలేకపోతే ఇలాంటి కుట్రల్లో పీఎంవో భాగమైనందుకుగానూ మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంట్లో, బ్యాంకు లాకర్లలో సోదాలు చేసినా సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిందని, అందువల్లే ఇప్పుడు ఈ స్టింగ్​ ఆపరేషన్​ను తెరపైకి తెచ్చారన్నారు. ప్రధాని కార్యాలయం, బీజేపీ ఆఫీసులు.. రాష్ట్రాల్లో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు రాత్రి, పగలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, స్టింగ్​పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ స్పందిస్తూ.. తనను అరెస్ట్​ చేయాలంటూ సవాల్​ విసిరిన సిసోడియా.. దమ్మున్న వ్యక్తి అని, ఆయన సవాల్​ను బీజేపీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.